Anmol Vasistha: భారత పారా అథ్లెటిక్స్ రంగాన్ని డోపింగ్ భూతం కుదిపేసింది. న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో నిషేధిత అనాబోలిక్ స్టెరాయిడ్ ఉపయోగించినట్లు తేలడంతో, ఇండియన్ పారా అథ్లెట్ అన్మోల్ వసిష్ఠ (Anmol Vasistha) పై అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (IPC) మూడేళ్ల పాటు తీవ్ర నిషేధం విధించింది.
మార్చిలో శాంపిల్ సేకరణ.. దొరికిపోయిన స్టెరాయిడ్:
మార్చి 11వ తేదీన జరిగిన పురుషుల జావెల్రిన్ త్రో F55 ఈవెంట్ పోటీల సమయంలో అన్మోల్ వసిష్ఠ నుంచి మూత్ర శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్‌ను పరీక్షించగా, వాడా (WADA) 2026 నిషేధిత పదార్థాల జాబితాలో ఉన్న 'డిహైడ్రోక్లోరోమెథైల్-టెస్టోస్టెరాన్' (DHCMT) అనే అనాబోలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్ వాడినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీ నుంచి అతనిపై ప్రాథమిక నిషేధం విధించగా, విచారణ అనంతరం వసిష్ఠ తన తప్పును అంగీకరించాడు.
మూడేళ్ల పాటు ఆటలకు దూరం:
ఐపీసీ ప్రకటించిన ఈ మూడేళ్ల నిషేధ కాలం 2026 ఏప్రిల్ 24 నుంచి 2029 ఏప్రిల్ 23 వరకు అమల్లో ఉంటుంది. ఈ సమయంలో అన్మోల్ వసిష్ఠ ఎలాంటి అధికారిక క్రీడా పోటీలు లేదా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేకుండా నిషేధం విధించారు. కేవలం డోపింగ్ నిరోధక విద్యా కార్యక్రమాలు లేదా పునరావాస (Rehabilitation) శిక్షణలో మాత్రమే పాల్గొనడానికి అనుమతి ఉంటుంది. అంతేకాకుండా, న్యూఢిల్లీ గ్రాండ్ ప్రిక్స్‌లో అతను సాధించిన ఫలితాలు, పతకాలు, పాయింట్లు, బహుమతులు అన్నింటినీ ఐపీసీ రద్దు చేసింది.
అథ్లెట్లదే పూర్తి బాధ్యత ఐపీసీ క్లారిటీ:
క్రీడాకారులు నిషేధిత ఉత్ప్రేరకాలు ఉద్దేశపూర్వకంగా వాడినా లేక తెలియక వాడినా, వారి శరీరంలో ఆ పదార్థాలు లభ్యమైతే దానికి అథ్లెట్లే పూర్తి బాధ్యత (Strict Liability) వహించాల్సి ఉంటుందని ఐపీసీ స్పష్టం చేసింది. క్రీడల్లో డోపింగ్ రహిత వాతావరణాన్ని కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఐపీసీ ప్రకటించింది.
