ప్రముఖ రిటైల్ బ్రాండ్లు, దిగ్గజ క్విక్ -కామర్స్ సంస్థల పేర్లు.. కాలం చెల్లిన ఆహార పదార్థాల అక్రమ దందాలో వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకునే దిగ్గజ కంపెనీల లోపల జరుగుతున్న మోసం గుట్టును మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) అధికారులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డైరెక్టర్తో పాటు 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
మహారాష్ట్రలోని థానే, పూణే జిల్లాల్లో FDA అధికారులు ఏకకాలంలో నిర్వహించిన మెరుపు దాడితో ఈ భారీ కుంభకోణం బయటపడింది. మార్కెట్లో అమ్మేందుకు వీలులేని, పాడైపోయిన, గడువు ముగిసిన, వినియోగదారులు తిరస్కరించిన ఆహార ఉత్పత్తులను ధ్వంసం చేయాల్సి ఉండగా.. వాటిని కొందరు అక్రమంగా దారి మళ్లించారు. ఈ దందాలో భాగంగా సుమారు 48 లక్షల రూపాయల విలువైన ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకోవటం సంచలనంగా మారింది.
ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై థానేలోని శాంతి నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ హోల్ టైమ్ డైరెక్టర్ వి. సుబ్రమణ్యంతో పాటు రిలయన్స్ రిటైల్, బ్లింకిట్, జొమాటో హైపర్ ప్యూర్ సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు, ఉద్యోగులు, డిస్పోజల్ ఏజెన్సీల నిర్వాహకులు ఈ జాబితాలో ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత(BNS) నిబంధనల ప్రకారం వీరిపై కేసులు నమోదయ్యాయి.
నిబంధనల ప్రకారం గడువు ముగిసిన ఉత్పత్తులను బాధ్యతాయుతంగా డిస్పోస్ చేయాల్సిన డిస్పోజల్ ఏజెన్సీలు, ఎలాంటి తనిఖీలు లేకుండానే వస్తువులు ధ్వంసం అయినట్లు ఫేక్ ధృవీకరణ పత్రాలు జారీ చేశాయని అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో భివాండిలోని లైసెన్స్ లేని యార్డుల్లో ఈ వస్తువులను వేరుచేసి, మంచిగా కనిపించే ప్యాకెట్లను బ్రోకర్ల ద్వారా మళ్లీ మార్కెట్ల్లో ప్రజలకు అమ్మేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
ఈ కుంభకోణానికి సంబంధించి ఎఫ్డీఏ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘించిన 5 సంస్థల లైసెన్స్లను సస్పెండ్ చేయడంతో పాటు, అనుమతులు లేకుండా నడుస్తున్న 4 వ్యాపార కేంద్రాల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి అక్రమాలకు పాల్పడే ఎంతటి దిగ్గజ సంస్థలకైనా చట్టపరమైన శిక్ష తప్పదని మహారాష్ట్ర అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిని చూస్తున్న ప్రజలు తాము కొనుక్కుంటున్న సరుకులు మంచివేనా అనే డైలమాలో పడిపోతున్నారు. పెద్దపెద్ద షాపులు, యాప్స్ ని నమ్ముకోవటం కంటే ఎప్పటికప్పుడు తక్కువ సరుకు తెచ్చి అమ్ముకునే తమ ఇళ్ల దగ్గరి కిరాణా షాపులే నయం, అక్కడే చెక్ చేసుకోవటంతో పాటు ఏమైనా పాడైతే రెస్పాన్స్ కూడా బాటుంగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
