అండర్‌కవర్ ఏజెంట్ అంటూ బిల్డప్.. ఐదు ఐఫోన్లు, టెస్లా కారుతో దొరికిపోయిన నకిలీ ఐఏఎస్ !

అండర్‌కవర్ ఏజెంట్ అంటూ బిల్డప్.. ఐదు ఐఫోన్లు, టెస్లా కారుతో దొరికిపోయిన నకిలీ ఐఏఎస్ !

ఐఏఎస్ అధికారిగా నటిస్తూ, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్‌తో తనకు సంబంధాలున్నాయని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని బీహార్‌లో పోలీసులు అరెస్టు చేశారు.  బీహార్‌లోని ఖగారియా జిల్లా గోగ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని జమాల్‌పూర్‌కు చెందిన మనీష్ గుప్తా అనే వ్యక్తి.. తానొక సీనియర్ ఐఏఎస్ అధికారినని, నేరుగా ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ కింద అండర్‌కవర్ ఏజెంట్‌గా పనిచేశానని నమ్మిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అతని నివాసంలో ఆకస్మిక సోదాలు నిర్వహించి అతన్ని అరెస్టు చేశారు.

ఇంట్లో దొరికిన వస్తువులు
నిందితుడు మనీష్ గుప్తా ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా భారీగా విలాసవంతమైన వస్తువులు బయటపడ్డాయి. వాటిలో  ముఖ్యంగా టెస్లా కారు, టాటా సఫారీ ఎస్‌యూవీ ఉండగా... 'govt of india' అనే బోర్డు ఉన్న టెస్లా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇండియాలో ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ ఫీచర్ ఉన్న టెస్లా కారు ఉండటం.. అది కూడా చాలా అరుదు కావడం విశేషం. ఇంకా 31 లీటర్లకు పైగా దిగుమతి చేసుకున్న విదేశీ మద్యం, భారీగా బీరు బాటిళ్లు... 5 ఐఫోన్‌లు, 20 క్రెడిట్ కార్డులు, 8 డెబిట్ కార్డులు, 4 చెక్ బుక్కులు ఉన్నాయి. రెండు 'బరసింఘా' (చిత్తడి నేల జింక) కొమ్ములను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఇవి  ఉండటం నేరం. 

బయటపడిన నకిలీ ఐడి కార్డులు:
విచారణ సమయంలో మనీష్ గుప్తా.... నేను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC)కు చెందినట్లు చెప్పే ఒక కార్డును, అలాగే ఐఏఎస్ అధికారిగా గుర్తింపుతో నకిలీ ఐడీ కార్డును పోలీసులకు చూపించాడు. అయితే ప్రాథమిక విచారణలోనే అవన్నీ ఫేక్ అని  తేలిపోయాయి.

ALSO READ : నెగ్గిన ప్రతిపక్షాల పంతం: విద్యార్థులపై లాఠీచార్జ్‎పై సభలో అమిత్ షా ప్రకటన

పోలీసుల దర్యాప్తు
అతను ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా సంపాదించాడు ? ఈ మోసాల వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOU) సహకారంతో అతని అక్రమాస్తులపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది.