భారత్‌లో విదేశీ పెట్టుబడులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పన్ను విధానంలో కీలక మార్పులు చేసింది. లోక్‌సభ ఆమోదించిన టాక్సేషన్ అమెండ్మెంట్ బిల్లు ద్వారా డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలకు దీర్ఘకాలిక పన్ను ప్రయోజనాలు కల్పిస్తోంది. జూన్ 5న జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో వచ్చిన ఈ బిల్లు.. అంతర్జాతీయ కంపెనీలకు పన్ను విధానంలో మరింత స్పష్టత, స్థిరత్వాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్‌ను గ్లోబల్ తయారీ కేంద్రంగా మార్చే ప్రయత్నాలకు ఈ బిల్లు మరింత ఊతమివ్వనుంది. భారతీయ కాంట్రాక్ట్ తయారీదారులతో నిర్దిష్ట ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేయించే విదేశీ కంపెనీలకు లభించే ఆదాయపు పన్ను మినహాయింపును మార్చి 31, 2041 వరకు పొడిగించింది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లను కస్టమ్స్-బాండెడ్ గోదాముల్లో నిల్వ చేసి భారతీయ కాంట్రాక్ట్ తయారీదారులకు సరఫరా చేసే విదేశీ కంపెనీలకు 15 ఏళ్ల పన్ను మినహాయింపు కల్పిస్తోంది.
దీర్ఘకాలిక పన్ను భరోసా కారణంగా భారీ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రణాళికలు రూపొందించడం సులభమవుతుందని ఇండస్ట్రీ అంటోంది. దీని ప్రభావంతో తయారీ సామర్థ్యం పెరగడం, స్థానికంగా కాంపోనెంట్ల ఉత్పత్తి విస్తరించడం, దేశీయ సరఫరా వ్యవస్థ బలోపేతం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. తద్వారా ఉద్యోగాలు, మౌలిక వసతులు, స్థానిక వ్యాల్యూ చైన్ కూడా బలపడవచ్చు.
డేటా సెంటర్లకు ఈజీ రూల్స్..
డిజిటల్ మౌలిక వసతుల విషయంలోనూ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించే విదేశీ కంపెనీలకు ఉన్న కొన్ని అనుమతి, నోటిఫికేషన్ నిబంధనలను తొలగించింది. అలాగే డేటా సెంటర్లు సొంతంగా నిర్మించుకోవాల్సిన అవసరం లేకుండా లీజుకు తీసుకున్న మౌలిక వసతులతోనూ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం కల్పించింది.
ఈ మార్పులతో గ్లోబల్ క్లౌడ్, టెక్నాలజీ కంపెనీలు భారత్‌లో డేటా సెంటర్ సామర్థ్యాన్ని వేగంగా పెంచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతుల ప్రక్రియలోని అడ్డంకులు తగ్గితే పెట్టుబడులు మరింత వేగంగా రావచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
అయితే డేటా సెంటర్ల నిర్మాణం మాత్రమే భారత్ ముందున్న లక్ష్యం కాదు. దేశంలోని కీలక డిజిటల్ మౌలిక వసతులపై నియంత్రణ కూడా అంతే ముఖ్యమైన అంశం. కంప్యూటింగ్, స్టోరేజ్, నెట్‌వర్కింగ్, వర్చువలైజేషన్ వంటి మొత్తం క్లౌడ్ వ్యవస్థపై దేశీయ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఈ బిల్లు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు భారత్‌లో తయారీ, సరఫరా వ్యవస్థలు, డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేయాలన్న కేంద్రం వ్యూహాన్ని సూచిస్తోంది. అయితే ఈ మార్పులు వాస్తవ పెట్టుబడులు, కొత్త తయారీ యూనిట్లు, స్థానిక సరఫరా గొలుసులు, బలమైన దేశీయ డిజిటల్ వ్యవస్థగా మారుతాయా అనేదే ఇప్పుడు అసలు పరీక్ష.
