ఆధ్యాత్మికం: దేవుడి గదిని ఏరోజు శుభ్రం చేయాలి.. పాటించాల్సిన నియమాలు ఇవే..!

ఆధ్యాత్మికం:  దేవుడి గదిని ఏరోజు శుభ్రం చేయాలి.. పాటించాల్సిన నియమాలు ఇవే..!

హిందువులకు చెందిన ప్రతి ఇంటిలో దేవుని గది ఉంటుంది.  ప్రత్యేకంగా లేకపోయినా ఇంట్లో ఈశాన్య దిక్కులో ధ్యానానికి.. పూజకు అనుకూలంగా చిన్న సైజు దేవుని మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటాం.  నిత్యం సమయాన్ని బట్టి పూజ చేస్తుంటాం.  అయితే దేవుని గది లేదా పూజామందిరం ఉన్న గదిని ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు.   ధర్మశాస్త్రం ప్రకారం పూజా గది పరిశుభ్రతకు సంబంధించిన ముఖ్యమైన నియమాలు, జాగ్రత్తలు, ఆచారాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. . .!

హిందూ సంప్రదాయంలో ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం దేవుని గది (పూజా మందిరం). ఇది కేవలం పూజలు చేసే స్థలం మాత్రమే కాదు, దైవ చైతన్యం కొలువై ఉంటుందని  పండితులు చెబుతుంటారు. అందుకే దేవుని గది పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంచాలని ధర్మశాస్త్రాలు సూచిస్తాయి. 

 గరుడ పురాణంలోని ఆచార ఖండం, పూజా విధానాలకు సంబంధించిన వివరణల్లో పూజాగది పరిశుభ్రత గురించి వివరించారు రుషులు.  పురాణాల ప్రకారం పూజగదిని.. పూజామందిరాన్ని  ఉదయం స్నానం చేసిన తర్వాత, పూజ ప్రారంభించే ముందు  శుభ్రపరచాలి. గదిని శుభ్రం చేసి, దేవతల విగ్రహాలు లేదా చిత్రాలను తుడిచి, దీపం వెలిగించి, తాజా పూలతో అలంకరించి పూజ చేయడం వల్ల ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుందని నమ్ముతారు. 

 బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, యోగ వంటి ఆధ్యాత్మిక సాధనలకు అనుకూలమైన సమయంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం, సంధ్యా సమయం తర్వాత లేదా రాత్రివేళ దేవుని గదిని పూర్తిగా శుభ్రం చేయడం మంచిది కాదు. రాత్రిపూట ఊడ్చడం, నేలను తుడవడం .. దేవుని దగ్గర  అలంకరణను పూర్తిగా మార్చడం వంటి పనులను నివారించాలని  పండితులు సూచిస్తారు. సాయంకాల హారతి లేదా దీపారాధనకు ముందు దేవుని పీఠం, విగ్రహాలు లేదా ఫోటోలపై పేరుకున్న దుమ్మును శుభ్రమైన పొడి వస్త్రంతో సున్నితంగా తుడవాలి. 

దేవుడి గదిని శుభ్రం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు

  • దేవుని గదిని.. పూజా మందిరాన్ని శుభ్రపరిచే ముందు  చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే స్నానం చేసిన తర్వాతే  దేవుడి గదిలోకి ప్రవేశించాలి.
  •  విగ్రహాలు, పటాలను తుడవడానికి ప్రత్యేకంగా ఉంచిన శుభ్రమైన వస్త్రాన్నే ఉపయోగించాలి. 
  • శుభ్రపరిచిన తర్వాత కొద్దిగా గంగాజలం లేదా పవిత్ర జలాన్ని (జీవనదులు: గోదావరి, కృష్ణా, కావేరి,పెన్న మొదలగు నదుల)  చల్లితే చాలా మంచిది. 
  • వాడిపోయిన పూలు, పాత పూజా సామగ్రిని వెంటనే తొలగించి, తాజా పూలతో అలంకరించాలి.
  •  దేవుని గదిలో అనవసర వస్తువులు లేదా విరిగిన పూజా సామగ్రిని నిల్వ ఉంచకూడదు.

పూర్తిగా  ఏ రోజు శుభ్రం చేయాలి

 దేవుని గదిని  పూర్తిగా శుభ్రపరచడానికి శనివారం అనుకూలమైన రోజుగా కొన్ని ఆచార సంప్రదాయాలు పేర్కొంటాయి. ఎట్టి పరిస్థితిలో  గురువారం, ఏకాదశి రోజుల్లో దేవుని గదిని  పూర్తిగా  ఎట్టి పరిస్థితిలో శుభ్రం చేయకూడదు. ( తడిబట్ట పెట్టడం, గదిని చీపురుతో శుభ్రం చేయడం వంటివి చేయాలి) .  ఉదయం స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు దేవుని గదిని శుభ్రపరచడం ఉత్తమమైన ఆచారంగా భావిస్తారు. పరిశుభ్రత, భక్తి, నియమ నిష్ఠలతో చేసే పూజకు మరింత ఆధ్యాత్మిక విలువ ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.