రోజంతా ఆఫీసులో ఏసీ రూంలో గంటల తరబడి కూర్చుని బయటకు అడుగు పెట్టగానే మీ చర్మం ఒక్కసారిగా జిడ్డుగా మారడం, చెమటలు పట్టడం లేదా మొటిమలు రావడం జరుగుతుందా ? ఇది మీ భ్రమ కాదు! ఎందుకంటే, మన దేశంలో ఎండకాలం, వర్షాకాల నెలల్లో చర్మం గంటల తరబడి రెండు వేర్వేరు వాతావరణాల మధ్య మారుతూ ఉంటుంది.ఏసీ గదుల్లోని పొడి గాలికి, బయట ఉండే వేడి, తేమ వాతావరణానికి మధ్య నిరంతరం మారుతుండటమే ఇందుకు అసలు కారణం. ప్రముఖ డాక్టర్ చెప్పిన వివరాల ప్రకారం, ఈ రెండు వాతావరణాలు చర్మాన్ని ఎలా ప్రభావం చేస్తాయో, వాటి నుంచి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం....
మీ చర్మానికి ఏసీ..
ఏసీ రూముల్లో గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ సేపు ఏసీలో ఉండేవారి చర్మం త్వరగా పొడిబారి, బిగుసుకుపోయి డీహైడ్రేషన్ కి గురవుతుంది. ఇది చర్మానికి రక్షణగా ఉండే పై పొరను దెబ్బతీస్తుంది. ఫలితంగా చర్మంలో సున్నితత్వం పెరిగి, కాంతిహీనంగా మారుతుంది.
బయట వేడి, తేమ వాతావరణం
ఆఫీసు నుంచి బయట వేడి వాతావరణంలోకి అడుగుపెట్టగానే చర్మంపై చెమట, జిడ్డు పెరుగుతుంది. ఈ చెమట, జిడ్డు , కాలుష్యం, సూర్యరశ్మి అన్నీ కలిసి చర్మ రంధ్రాలను మూసివేసి మొటిమలకు దారితీస్తాయి. కేవలం తేమ మాత్రమే కాకుండా.. వేడి, కాలుష్యం, యూవీ కిరణాలు అన్నీ కలిపి చర్మం ముసలిపోయేలా (Aging) చేయడానికి, కొల్లాజెన్ దెబ్బతినడానికి కారణమవుతాయి.
అసలు సమస్య ఏమిటి?
ఏసీలోని చల్లని, పొడి గాలి నుంచి ఒక్కసారిగా వేడి, తేమ ఉండే బయటి వాతావరణానికి పదేపదే మారుతుండటమే అసలైన సవాలు. ఈ ఉష్ణోగ్రతల తేడా వల్ల చర్మం ఒక్కసారిగా పొడిబారడం లేదా విపరీతమైన జిడ్డుగా మారడం జరుగుతుంది.
చర్మాన్ని కాపాడుకోవడానికి
*మీ చర్మం నుంచి సహజ జిడ్డుని తొలగించే, పీహెచ్-సమతుల్యత (pH-balanced) ఉన్న మంచి క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
*సెరామైడ్లు (Ceramides), గ్లిజరిన్ లేదా హైలురోనిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి. ఆఫీసులో ఏసీ కింద ఉంటూ చర్మం పొడిబారినట్లు అనిపిస్తే పగటిపూట కూడా కాస్త మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు.
*బయటి నుంచి రాగానే చెమట, జిడ్డు పోవడానికి ముఖం కడుక్కోవడం మంచిదే కానీ, పదేపదే కడగడం వల్ల చర్మ రక్షణ పొర మరింత బలహీనపడుతుంది.
*మీరు ఎక్కువ సమయం ఇంట్లోనో లేదా ఆఫీసులో గడుపుతుంటే.. సన్‌స్క్రీన్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఎండ తగలడం వల్ల చర్మం త్వరగా వృద్ధాప్యం చెందకుండా కాపాడుతుంది.
ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
మీరు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్న... చర్మంపై మంట, పొడిబారడం, ఎరుపుదనం లేదా మొటిమలు తగ్గకపోతే మాత్రం అది కేవలం వాతావరణ మార్పుల సమస్య కాకపోవచ్చు. అలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా చర్మవ్యాధి నిపుణుడిని (Dermatologist) సంప్రదించడం మంచిది.
ఏసీని గానీ, బయటి వాతావరణాన్ని గానీ మనం మార్చలేం. కానీ సరైన చర్మ సంరక్షణ పద్ధతులు (Skincare routine) పాటిస్తూ, చర్మాన్ని సరిగ్గా మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉంటే ఈ వాతావరణ మార్పుల నుంచి మీ చర్మాన్ని ఈజీగా కాపాడుకోవచ్చు!
