చెన్నై: తమిళనాడులో విజయ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై.. తమిళనాడులోని అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలలో కార్యక్రమాలు ప్రారంభమయ్యే ముందు 'తమిళ్ తాయ్ వాళ్తు' (Tamil Thai Vazhthu) గీతాన్ని తప్పనిసరిగా మొదట ఆలపించాలని తమిళనాడు అసెంబ్లీ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని సోమవారం (ఆగస్టు 10, 2026) అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రవేశపెట్టారు. విజయ్ సర్కార్ చేసిన ఈ తీర్మానానికి DMK, AIADMKతో సహా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి.
అధికారిక కార్యక్రమాలలో జాతీయ గీతానికి ముందు వందేమాతరం గీతాన్ని తప్పకుండా ఆలపించాలని.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన క్రమంలో తమిళనాడులో విజయ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో తమిళ తాయ్ వాళుత్తును పాడాలని నిర్దేశిస్తూ తమిళనాడు ప్రభుత్వం 1970 నవంబర్ 23న ఒక ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 12న దీనిని అధికారికంగా రాష్ట్ర గీతంగా గుర్తించింది.
