కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుతున్నాయి. రష్యా దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ కౌంటర్ అటాక్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం (ఆగస్ట్ 10) రష్యాలోని టాటార్‌స్తాన్ ప్రాంతంపై ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో కనీసం 13 మంది మరణించారు. మృతుల్లో ఒకరు చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 75 మంది గాయపడగా, వారిలో 21 మందిని ఆసుపత్రిలో చేర్చినట్లు వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా భూభాగంపై ఉక్రెయిన్ చేసిన భారీ దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది.
ఈ దాడిని ఉక్రెయిన్ ధృవీకరించింది. తమ దేశ సరిహద్దుకు వెయ్యి కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న నిజ్నెకామ్స్క్ పారిశ్రామిక నగరంలోని చమురు శుద్ధి కర్మాగారంపై దాడి చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. రష్యా దురాక్రమణలో సైనిక సామర్థ్యాన్ని తగ్గించడంలో భాగంగా టాట్‌నెఫ్ట్ నియంత్రణలో ఉన్న టానెకో రిఫైనరీపై దాడి చేసినట్లు కీవ్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉక్రెయిన్ డ్రోన్లు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను తాకగానే భారీగా పేలుడు సంభవించింది.
ALSO READ : యెమెన్‌లో హౌతీల దాడులు.. సౌదీ ఆయిల్ రిఫైనరీపైనా డ్రోన్ అటాక్
నిజ్నెకామ్స్క్ పారిశ్రామిక నగరంలో జరిగిన దాడిని స్థానిక అధికారులు ధృవీకరించారు. ఈ దాడిలో ఇప్పటివరకు 13 మంది మరణించారని తెలిపారు. మరికొందరు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ దాడిని రష్యా ఉగ్రదాడిగా అభివర్ణించింది. రష్యా దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశాయి. ఈ దాడికి రష్యా ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుందనే దానిపై ఆందోళన నెలకొంది.
