యెమెన్‌‌‌‌‌‌‌‌లో హౌతీల దాడులు.. సౌదీ ఆయిల్ రిఫైనరీపైనా డ్రోన్ అటాక్

యెమెన్‌‌‌‌‌‌‌‌లో హౌతీల దాడులు.. సౌదీ ఆయిల్ రిఫైనరీపైనా డ్రోన్ అటాక్
  • 11 మంది మృతి..32 మందికి గాయాలు 

 రియాద్/సనా: ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఆదివారం యెమెన్‌‌‌‌‌‌‌‌లోని మోఖా పోర్టు ప్రాంతంలో జరిపిన మిసైల్, డ్రోన్ దాడుల్లో 11 మంది మరణించారని ప్రభుత్వ వైద్య అధికారులు ప్రకటించారు. ఈ దాడులలో ముగ్గురు పౌరులు, 8 మంది సైనిక సిబ్బంది మరణించారని వెల్లడించారు. మరో32 మంది గాయపడ్డారని, వారిలో ఆరుగురు పౌరులు ఉన్నారని తెలిపారు.

 ఈ దాడులపై హౌతీల సైనిక ప్రతినిధి యాహ్యా సారీ మాట్లాడుతూ.. తమ గ్రూప్ క్షిపణులు, డ్రోన్లతో మోఖా పోర్టు ప్రాంతంలోని సౌదీ శత్రు సైనికులను, ఆయుధాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్టు తెలిపారు. అంతకుముందు, సౌదీ అరేబియాలోని జజాన్‌‌‌‌‌‌‌‌లో ఆరామ్‌‌‌‌‌‌‌‌కో సంస్థకు చెందిన ఆయిల్ రిఫైనరీపైనా హౌతీ రెబెల్స్ డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. 

డ్రోన్ పేలుళ్లతో రిఫైనరీలో మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాయవ్య యెమెన్‌‌‌‌‌‌‌‌ గగనతలంలోకి సౌదీ డ్రోన్ల చొరబాట్లకు ప్రతిస్పందనగా ఈ దాడులు చేసినట్టు యాహ్యా సారీ వెల్లడించారు. 

కాగా, యెమెన్‌‌‌‌‌‌‌‌లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలకు, సౌదీ మద్దతు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మధ్య సుదీర్ఘకాలంగా అంతర్యుద్ధం కొనసాగింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 2022లో కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా.. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని హౌతీలు రద్దు చేసుకున్నారు. 

హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ దిగ్బంధనానికి సమాంతరంగా, సౌదీ అరేబియాపై ఎర్ర సముద్రంలో దిగ్బంధనం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఎర్రసముద్రంలో సౌదీ ట్యాంకర్లను, దేశంలోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు.