డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘పాంచాలి పంచభర్తృక’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. గంగ సప్తశిఖర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సరీ ఫర్, రోల్ రిడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ డ్రామాతో కూడిన ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మహేశ్ నారాయణ మాట్లాడుతూ.. దర్శకుడు గంగ సప్తశిఖర ఇచ్చిన స్వేచ్ఛతో తక్కువ సమయంలోనే పాటలను పూర్తి చేశామని తెలిపారు. ప్రయోగాత్మకంగా రూపొందించిన కవ్వాలీ పాటను రాజేంద్ర ప్రసాద్ మెచ్చుకున్నారని చెప్పారు. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని అన్నారు.
సినిమా ఆద్యంతం వినోదాన్ని అందిస్తుందని తెలిపారు. అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చెప్పారు డైరెక్టర్ గంగ సప్తశిఖర. రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభవమని, ఆయన ఈ సినిమాలో పాటలు, ఫైట్స్‌తో పాటు కీలక సన్నివేశాల్లో పాల్గొన్నారని వెల్లడించారు. చిత్రంలో 50 మందికి పైగా నటీనటులు వివిధ పాత్రల్లో కనిపిస్తారని తెలిపారు.
►ALSO READ | Nuvvu Nenu: ‘నువ్వు నేను’కు పాతికేళ్లు.. ఓ తరం యువతను ఊపేసిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ
తన సినీ కెరీర్ ప్రారంభంలో రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తుచేసుకున్నారు థర్టీ ఇయర్స్ పృథ్వీ. ఆయనతో మరోసారి కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు గంగ సప్తశిఖర ప్రతిభావంతుడని, నటీనటుల నుంచి మంచి నటన రాబట్టారని ప్రశంసించారు. నటుడు బాల కూడా సినిమా సెట్స్‌లో కుటుంబ వాతావరణం ఉండేదని, తన పాత్రలో వినోదానికి ప్రాధాన్యం ఉందని తెలిపారు.
నటి కుమారి ఆంటీ, సునీత, యోగి, రాంకీ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమాలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. మంచి వినోదాన్ని అందించే చిత్రంగా ‘పాంచాలి పంచభర్తృక’ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టి, సాయినాథ్ మణ్యం నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
