Nuvvu Nenu: ‘నువ్వు నేను’కు పాతికేళ్లు.. ఓ తరం యువతను ఊపేసిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ

Nuvvu Nenu: ‘నువ్వు నేను’కు పాతికేళ్లు.. ఓ తరం యువతను ఊపేసిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రేమకథలకు కొదవలేదు. ఎన్నో క్లాసిక్స్ వచ్చాయి, ప్రేక్షకులను అలరించాయి. కానీ, ఒక తరం యువతను ఉర్రూతలూగించి, లవర్ బాయ్ ట్రెండ్‌కు నాంది పలికిన అరుదైన చిత్రం ‘నువ్వు నేను’ (Nuvvu Nenu). సరిగ్గా 2001 ఆగస్ట్ 10న విడుదలైన ఈ చిత్రం, నేటితో విజయవంతంగా 25 ఏళ్లు (పాతికేళ్లు) పూర్తి చేసుకుని రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ చరిత్రలో ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలిచిన ఈ సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం..

డైరెక్టర్ తేజ అల్టిమేట్ మాస్టర్ పీస్..

‘చిత్రం’ వంటి సంచలన విజయం తర్వాత విలక్షణ దర్శకుడు తేజ తెరకెక్కించిన రెండో సినిమానే ‘నువ్వు నేను’. పేదరికం, ధనస్వామ్యం మధ్య నలిగిపోయే ప్రేమికుల కథను ఎంతటి సున్నితంగా, వాస్తవికంగా చూపించవచ్చో తేజ నిరూపించారు. కథాంశం సాధారణమైనదే అయినా, స్క్రీన్ ప్లే, సన్నివేశాల్లోని ఇంటెన్సిటీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమాతో తేజ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయారు.

ఉదయ్ కిరణ్ - అనిత మ్యాజికల్ కెమిస్ట్రీ..

‘చిత్రం’ మూవీతో హీరోగా పరిచయం అయ్యి, తన రెండో సినిమా ‘నువ్వు నేను’తో ఓవర్ నైట్ స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్. ఇందులో రవి పాత్రలో ఉదయ్ కిరణ్ చూపిన అమాయకత్వం, నటన యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

►ALSO READ | August 15th Movies: ఈ వారం థియేటర్లలో ఆడియన్స్కు పండుగే.. ఆగస్ట్ 15కి బాక్సాఫీస్ బరిలో 7 సినిమాలు..

హీరోయిన్ అనిత (వసుంధర పాత్రలో) అభినయం కూడా సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. ఉదయ్ కిరణ్, అనిత జోడీ స్క్రీన్ పై కనిపిస్తే చాలు, ఆ మ్యాజిక్ ఇప్పటికీ ప్రేక్షకుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది.

చార్ట్ బస్టర్ మ్యూజిక్: ఆర్.పి. పట్నాయక్ మాయాజాలం

‘నువ్వు నేను’ సినిమా విజయానికి సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ అందించిన సంగీతం ప్రాణం పోసింది. ఈ సినిమాలోని ప్రతి పాట ఒక సెన్సేషన్. కులశేఖర్ సాహిత్యం అందించిన ఈ గీతాలు అప్పట్లో ప్రతి కాలేజీ క్యాంపస్‌లోనూ, లవర్స్ మధ్య మారుమోగాయి.

‘‘గాజువక పిల్ల’’

‘‘నీ కోసమే అన్వేషణ..’’

‘‘నువ్వు నేను ప్రేమ..’

‘‘నా గుండెలో నువ్వుండి పోవ’’.. వంటి పాటలు ఇప్పటకీ శ్రోతలను మైమరిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాతో ఆర్.పి. పట్నాయక్ టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు.

బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ.. 

చిన్న చిత్రంగా బరిలోకి దిగిన ‘నువ్వు నేను’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండానే సంచలన విజయం సాధించింది. పలు కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శితమై, ఆ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా సాధించిన అఖండ విజయంతో టాలీవుడ్‌లో లవ్ స్టోరీలకు ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ అయింది. ఇది ఉత్తమ చిత్రం క్యాటగేరిలో తెలుగుతో సహా నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. నువ్వు నేను' తో తేజ-ఉదయ్.. ఫిల్మ్ ఫేర్ & నంది అవార్డ్స్ గెలుచుకోవడమే కాదు.. తెలుగు సినీ ప్రేమికుల మనుసు గెలుచుకుని సినీ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

‘నువ్వు నేను’ బడ్జెట్ & బాక్సాఫీస్..

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా నిర్మించిన ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఏకంగా రూ.3 కోట్లకి పైగా బిజినెస్ జరుపుకుంది.  కానీ వచ్చిన కలెక్షన్స్ మాత్రం అప్పట్లో ట్రేడ్‌కు షాక్ ఇచ్చాయి. ఉదయ్ కిరణ్ నటన.. అనిత పర్ఫార్మెన్స్.. సునీల్ కామెడీ.. తెలంగాణ శకుంతల, తణికెళ్ల భరణి కాంబినేషన్.. ఆర్పీ పట్నాయక్ పాటలు.. ఒకటేంటి నువ్వు నేను సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. దాంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఒకటి రెండు కాదు నిర్మాతలకు, బయ్యర్లకు ఏకంగా 12 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. అందుకే 25 ఏళ్లైనా కూడా నువ్వు నేను అద్భుతం అంతే.

ఏరియాల వారీగా షేర్
నైజాం: రూ.4.65 కోట్లు
సీడెడ్: రూ.1.55 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ.1.62 కోట్లు
ఈస్ట్ గోదావరి: రూ.1.11 కోట్లు
వెస్ట్ గోదావరి: రూ.0.89 కోట్లు
గుంటూరు: రూ.0.93 కోట్లు
కృష్ణా: రూ.0.85 కోట్లు
నెల్లూరు: రూ.0.52 కోట్లు

ఏపీ + తెలంగాణ: రూ.12.09 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: రూ.3.44 కోట్లు
వరల్డ్‌వైడ్ షేర్: రూ.15.39 కోట్లు

అప్పటి మార్కెట్ పరిస్థితులతో పోలిస్తే ‘నువ్వు నేను’ సాధించిన ఈ వసూళ్లు అసాధారణమైనవే. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి.. భారీ లాభాలను అందించిన ఈ చిత్రం ఉదయ్ కిరణ్ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. 

ఎవర్ గ్రీన్ క్లాసిక్.. 

తెలుగు సినిమా చరిత్రలో ఎన్ని తరాలు మారినా ‘నువ్వు నేను’ ప్రత్యేకతే వేరు. ఉదయ్ కిరణ్ కెరీర్‌లోనే కాక, టాలీవుడ్ లవ్ స్టోరీల జాబితాలో ఇదొక మైలురాయి. నేడు ఈ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, సోషల్ మీడియాలో అభిమానులు ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలను, సినిమా తాలూకు సీన్లను షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. తరాలు మారినా, మనసులను హత్తుకునే ప్రేమకథల్లో ‘నువ్వు నేను’ ఎప్పటికీ చిరస్మరణీయమే!