అమరావతిలో బాలయ్య కొత్త సినిమాకి ముహూర్తం : కొరటాల శివ డైరక్షన్ లో NBK 112

అమరావతిలో బాలయ్య కొత్త సినిమాకి ముహూర్తం : కొరటాల శివ డైరక్షన్ లో NBK 112

నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. నటసింహం బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ సెట్ అయిన సంగతి తెలిసిందే. 'పవర్ మీట్స్ పర్పస్.. మాస్ బెకమ్స్ ఎ మూవ్‌మెంట్' అంటూ మే నెలలో వదిలిన ట్యాగ్‌లైన్‌తోనే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ #NBK112 ముహూర్తానికి టైమ్ ఫిక్స్ అయింది.

శ్రీవారి సన్నిధిలో గ్రాండ్ లాంచ్..

విజయవాడ సమీపంలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ దివ్య సన్నిధిలో జూన్ 25న ఉదయం 9 గంటలకు ఈ సినిమా పూజా కార్యక్రమం జరగనుంది. ఆ కలియుగ దైవం ఆశీస్సులతో ఈ బ్లాక్‌బస్టర్ జర్నీ అధికారికంగా ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే బాలయ్య, కొరటాల కాంబోలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీ నెలకొన్నాయి.

 ముఖ్య అతిథులుగా మంత్రులు..

ఈ వేడుకను కేవలం సినిమా ఈవెంట్‌లా కాకుండా, ఒక పండగలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. యువసుధా ఆర్ట్స్, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్ర ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఆయనతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొని చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ అందించనున్నారు. ఈ ఈవెంట్‌లో పొలిటికల్ అండ్ సినీ గ్లామర్ కలవబోతుండటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

మాస్ మేనరిజం

బాలయ్య బాబు ఊరమాస్ మేనరిజం, డైలాగ్ డెలివరీకి.. కొరటాల శివ మార్క్ సామాజిక సందేశం తోడైతే థియేటర్లు బద్దలైపోవడం ఖాయం. ఒక పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. బాలకృష్ణ కెరీర్‌లోనే ఇదొక మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోతుందని ఇండస్ట్రీ టాక్.

బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేయడానికి వస్తున్న ఈ 'మైటీ కాంబో' లైనప్, ఫస్ట్ లుక్ అప్‌డేట్స్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎంతో అతృతగా వెయిట్ చేస్తున్నారు. జూన్ 25న మొదలయ్యే ఈ వెండితెర జాతర ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి,, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తర్వాత బాలయ్య బాబు రేంజ్‌ను మరో మెట్టు ఎక్కించేందుకు కొరటాల శివ గట్టి ప్లానే వేసినట్టున్నాడు.