సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణకు హాజరు కావాలంటూ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం ( జూన్ 22 ) వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది కోర్టు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇవాళ కోర్టుకు హాజరు కానందున విచారణను జులై 6కు వాయిదా వేసింది కోర్టు. షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోర్టును కోరినట్లు సమాచారం
పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను A11గా చేర్చారు పోలీసులు. అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మంది నిందితులపై కేసు నమోదయ్యింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 19 మందికి సమన్లు జారీ చేసింది నాంపల్లి కోర్టు.
2024 డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, భద్రతా సిబ్బంది పాత్రపై విచారణ కొనసాగుతోంది..నిందితుల సమ్మన్ల ప్రక్రియ, విచారణలు పూర్తయిన అనంతరం కేసు ట్రయల్ రన్ కొనసాగనుంది.
