కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’. సాయి రాజేష్ కథను అందిస్తూ ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నాడు. జులై 24న సినిమా విడుదల కానుంది. తాజాగా తిరుపతిలో ఈ మూవీ మ్యూజికల్ ఫెస్ట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మణిశర్మ కంపోజ్ చేసిన 'జిగితార..' సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఈ చిత్రంలోని పాటలన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మణిశర్మ గారి మ్యూజిక్ సినిమాకు పెద్ద అస్సెట్. అలాగే ఇందులోని డైలాగ్స్ చాలా ఏళ్లు గుర్తుండిపోతాయి’ అని అన్నాడు.
ఈ చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని హీరోయిన్ శ్రీగౌరి ప్రియ చెప్పింది. డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ ‘జిగితార పాట మా అందరికీ చాలా స్పెషల్. ఈ పాటను కంపోజ్ చేసే టైమ్‌లో మణిగారితో, అలాగే పాట రాసేటప్పుడు అనంత శ్రీరామ్ గారితో ఆ మూవ్‌మెంట్స్ ఎంజాయ్ చేశాం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ పాట ఉంటుంది’ అని చెప్పాడు. సాయి రాజేష్ మాట్లాడుతూ ‘ఇది మరో ‘బేబీ’లాంటి చిత్రం. సెకండాఫ్ మొత్తం సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది.
ఎక్కువ ఎమోషన్‌తో మరింత ఇంటెన్స్‌గా సినిమా ఉంటుంది’ అని చెప్పారు. ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ ‘మూవీ అవుట్‌పుట్‌తో చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని అవార్డ్ ఫంక్షన్స్ జరిగినా అన్ని నామినేషన్స్‌లో లామినేషన్‌లా ఉంటారు కిరణ్ అబ్బవరం. లవ్ స్టోరీలని మించిన సినిమా ఇది’ అని అన్నారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పాల్గొన్నారు.
