రెవెన్యూ శాఖలో ఆపరేటర్లను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ( జూన్ 22 ) ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. రెవెన్యూ శాఖలో గత 8 నుండి 15 సంవత్సరాలుగా మీ సేవా, భూభారతి మరియు ఇతర ఔట్‌సోర్సింగ్ ఆపరేటర్లు అత్యంత కీలకమైన సేవలను అందిస్తూ వస్తున్నారని... తహసీల్దార్ కార్యాలయాల్లో భూ రికార్డులు, ధ్రువపత్రాల జారీ, ఎన్నికల విధులు, ప్రకృతి విపత్తుల సమయంలో అత్యవసర పనులు, ధరణి/భూభారతి సంబంధిత ఆన్‌లైన్ సేవలు, ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాలు వంటి అనేక కీలక బాధ్యతలను వారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
ఇటీవల కొందరు కొత్తగా నియమితులైన గ్రూప్-IV ఉద్యోగులు ఆపరేటర్ల అవసరం లేదని, ఆ పనులను తామే నిర్వహించగలమని ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించిన క్రమంలో ఆపరేటర్ల తొలగింపుపై చర్యలు చేపట్టడం జరిగిందని... అయితే ఈ నిర్ణయం క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు, శాఖ అవసరాలు మరియు ప్రజా సేవలపై పడే ప్రభావాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోందని అన్నారు.
గ్రూప్-IV ఉద్యోగులు ఇటీవలే శాఖలో చేరారని... వారికి శాఖలోని అన్ని అంశాలపై పూర్తి అవగాహన, అనుభవం ఏర్పడటానికి సమయం అవసరమని... మరోవైపు ఆపరేటర్లు అనేక సంవత్సరాల అనుభవంతో కార్యాలయాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రత్యేక డ్రైవ్‌లు, అత్యవసర ప్రభుత్వ కార్యక్రమాలు వంటి సందర్భాల్లో పగలు-రాత్రి తేడా లేకుండా పనిచేసిన అనుభవం వారికి ఉందని పేర్కొన్నారు
ముఖ్యంగా, ఆపరేటర్లను తొలగించడం వల్ల గ్రూప్-IV ఉద్యోగులకు ఏ విధమైన ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుందో కూడా స్పష్టంగా లేదని... వారి జీతాలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రతపై ఆపరేటర్ల ఉనికి ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని... అయినప్పటికీ ఒక వర్గం ఉద్యోగుల ఉపాధిని తొలగించాలని కోరడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు
రెవెన్యూ శాఖలో గత అనేక దశాబ్దాలుగా గ్రూప్-IV, గ్రూప్-II, గ్రూప్-I స్థాయి అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహించారు. కానీ తమ ఉద్యోగ ప్రయోజనాల కోసం ఇతరుల ఉపాధిని తొలగించాలని కోరిన సందర్భాలు చాలా అరుదు. శాఖలో పరస్పర గౌరవం, సహకారం మరియు సమిష్టి బాధ్యత అనే సంస్కృతి ఎప్పటి నుంచో కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన కొందరు ఉద్యోగులు ఇలాంటి ప్రతిపాదనలు చేయడం శాఖ సంప్రదాయాలకు, ప్రభుత్వ సేవా స్ఫూర్తికి విరుద్ధంగా కనిపిస్తోంది.
చదువు, అర్హతలు, పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగంలో చేరడం గొప్ప విషయం. అయితే రెవెన్యూ శాఖలో అనుభవం, పనితీరు, ప్రజలతో వ్యవహరించే నైపుణ్యం, వ్యవస్థపై అవగాహన కూడా అంతే ముఖ్యమైనవి. కేవలం విద్యార్హతల ఆధారంగా అనుభవజ్ఞులైన సిబ్బందిని తక్కువ అంచనా వేయడం సమంజసం కాదు.
ఈ నిర్ణయం వల్ల సుమారు 600 మంది మీ సేవా ఆపరేటర్లు, భూభారతి ఆపరేటర్లు మరియు వారి కుటుంబాలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నాయి. పరోక్షంగా చూస్తే వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడుతోంది. ఇది కేవలం ఉద్యోగాల సమస్య మాత్రమే కాదు, ఒక సామాజిక మరియు మానవీయ అంశం కూడా.
తహసీల్దార్ కార్యాలయాలు ప్రస్తుతం విపరీతమైన పని భారంతో నడుస్తున్నాయి. రోజురోజుకు కొత్త ప్రభుత్వ కార్యక్రమాలు, ఆన్‌లైన్ సేవలు, ఎన్నికల విధులు, భూ సంబంధిత పనులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో అనుభవజ్ఞులైన ఆపరేటర్లను తొలగించడం వల్ల పని భారం మరింత పెరిగి, ప్రజలకు సేవలందించడంలో జాప్యం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టరేట్లలోని సిబ్బంది మరియు చివరకు ప్రజలపైనే పడుతుంది.
అందువల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లు మరియు క్షేత్రస్థాయి అధికారుల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. శాఖ అవసరాలు, ప్రజా ప్రయోజనం, పని భారం మరియు ఆపరేటర్ల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సమగ్ర సమీక్ష అనంతరం మాత్రమే నిర్ణయం తీసుకోవడం సముచితం.
రెవెన్యూ శాఖ ప్రజలతో నేరుగా అనుసంధానమైన అత్యంత కీలకమైన శాఖ. ఈ శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్న సమయంలో అనుభవజ్ఞులైన ఆపరేటర్లను తొలగించడం కాకుండా, వారి సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలి.
కాబట్టి ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ఈ అంశాన్ని పునరాలోచించి, ఆపరేటర్ల సేవలను కొనసాగిస్తూ వారి అనుభవాన్ని శాఖ ప్రయోజనాల కోసం వినియోగించేలా తగిన నిర్ణయం తీసుకోవాలని వినమ్రంగా కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు..
