ఐపీఎల్ బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్: లక్నో కెప్టెన్సీ నుంచి పంత్ ఔట్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్, LSGకి కుల్దీప్!

ఐపీఎల్ బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్: లక్నో కెప్టెన్సీ నుంచి పంత్ ఔట్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్, LSGకి కుల్దీప్!

Rishabh Pant Trade: ఐపీఎల్ (IPL 2026) ముగిసిన వెంటనే క్రికెట్ వర్గాల్లో ఒక సెన్సేషనల్ ట్రేడ్ డీల్ వార్త హాట్ టాపిక్‌గా మారింది. టోర్నమెంట్‌లో మొత్తం 10 జట్లలో ఆఖరి స్థానంలో నిలిచి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లక్నో కెప్టెన్సీ నుంచి రిషబ్ పంత్ తప్పుకున్నట్లు వస్తున్న వార్తల్లో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

కెప్టెన్సీ నుంచి పంత్ ని తొలగించిన లక్నో?: 
ఐపీఎల్ 2026 ఫైనల్ కి ముందు రిషబ్ పంత్ తన కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు, అతని అభ్యర్థనను తాము అంగీకరించినట్లు లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్‌మెంట్ మే 29న అఫీషియల్‌గా ప్రకటించింది. కానీ, తాజా రిపోర్టుల ప్రకారం ఇది పంత్ సొంత నిర్ణయం కాదని, లక్నో టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయమని తెలుస్తోంది. సీజన్ ముగిసిన వెంటనే రిషభ్ ను కెప్టెన్సీ నుంచి అంత తొందరగా తొలగించడంపై ఇప్పుడు కొత్త అనుమానాలకి దారి తీసింది. 

లక్నోలో అవమానం.. అందుకే ఢిల్లీలోకి పంత్: 
లక్నో సూపర్ జెయింట్స్‌లో తనకు సరైన గుర్తింపు, విలువ (Value) దక్కడం లేదని రిషబ్ పంత్ భావిస్తున్నట్లు క్రిక్‌బ్లాగర్ (CricBlogger) నివేదిక పేర్కొంది. కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత మేనేజ్‌మెంట్ తనను నిర్లక్ష్యం చేస్తోందని తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. తనకు విలువ ఇవ్వని ఫ్రాంచైజీలో కొనసాగడం కంటే బయటకు వచ్చేయడమే బెటర్ అని ఫిక్స్ అయిన పంత్.. వెంటనే కొత్త ఫ్రాంచైజీ కోసం వెతకడం ప్రారంభించి, చివరికి తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వైపు ఇంట్రెస్ట్ చూపించాడు. 

JSW మాస్టర్ ప్లాన్: 
రిషబ్ పంత్ తన పాత ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ట్రేడింగ్ ద్వారా తిరిగి వెళ్లేందుకు దాదాపు అంతా సిద్ధమైంది. ఈ భారీ డీల్‌లో భాగంగా ఢిల్లీ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లనున్నాడు. ఐపీఎల్ 2026లో కుల్దీప్ యాదవ్ పర్ఫామెన్స్ పట్ల లక్నో మేనేజ్‌మెంట్ ఫుల్ హ్యాపీగా ఉండటంతో ఈ ప్లేయర్ స్వాప్ డీల్‌కు లక్నో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ ట్రేడ్ డీల్ వెనుక ఢిల్లీ కో-ఓనర్ జేఎస్‌డబ్ల్యూ (JSW) కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో రిషబ్ పంత్ సూపర్ స్టార్‌గా ఎదిగిన తన పాత జట్టుకు మళ్లీ రావాలని వారు కోరుకున్నారు. దీనికోసం పంత్ తన శాలరీని తగ్గించుకోవడానికి (Salary cut) కూడా సిద్ధమైపోయాడట.