వెన్నులో వణుకు పుట్టిస్తున్న 'అగాధ' టీజర్.. హారర్ ప్రపంచంలోకి ఎం.ఎస్. రాజు గ్రాండ్ ఎంట్రీ!

వెన్నులో వణుకు పుట్టిస్తున్న 'అగాధ' టీజర్.. హారర్ ప్రపంచంలోకి ఎం.ఎస్. రాజు గ్రాండ్ ఎంట్రీ!

టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్ . రాజు అనగానే మనకు గుర్తుకువచ్చేది 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి క్లాసిక్ హిట్స్ చిత్రాలు.  అయితే, ఈసారి ఆయన రూటు మార్చారు.  వెన్నులో వణుకు పుట్టించేందుకు మూవీతో సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి హారర్ థ్రిల్లర్ 'అగాధ'. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లతో అంచనాలు పెంచాయి. లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

వణుకు పుట్టిస్తున్న...

టీజర్ ఆరంభంలోనే కామాక్షి భాస్కర్ల తన గంభీరమైన గొంతుతో.. మనుషుల అవగాహనకు మించిన అతీత శక్తులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అవే ఆత్మలు, దయ్యాలు అని చెప్పే డైలాగ్ ప్రేక్షకుల్లో ఒకరకమైన భయాన్ని నింపుతుంది. అగాధ అనేది ఒక రహస్యమైన శక్తి అని, అది ఎంతటి వినాశనానికైనా దారితీస్తుందని ఈ టీజర్ ద్వారా హింట్ ఇచ్చారు. ఇక ఉల్కా గుప్తా ఒక భయానకమైన వీడియో చూసి, అగాధ వచ్చేసింది అని చెప్పడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.

విజువల్ వండర్‌గా..

ఎం.ఎస్. రాజు ఈ చిత్రాన్ని కేవలం హారర్ మూవీగా మాత్రమే కాకుండా, విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. దీనికోసం దాదాపు 45 నిమిషాల నిడివి గల VFX (గ్రాఫిక్స్) ను ఉపయోగించినట్లు సమాచారం. ఈ చిత్రానికి నిర్మాతగా కాశీ విశాలాక్షి బలుసు వ్యవహరిస్తున్నారు.  శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, కామాక్షి భాస్కర్ల, జోవిక విజయ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కిన్ అరుళ్‌దేవ్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రాణం పోసింది. నాని చమిడిశెట్టి విజువల్స్ చాలా సహజంగా, భయంకరంగా ఉన్నాయి.

భారీ అంచనాలతో..

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా షూటింగ్ ఏకంగా 85 రోజుల పాటు సుదీర్ఘంగా సాగింది. వివిధ లొకేషన్లతో పాటు, ప్రత్యేకంగా రూపొందించిన సెట్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. టీజర్‌లో కనిపించిన భయంకరమైన శిరచ్ఛేదం సీక్వెన్స్ , డార్క్ అట్మాస్పియర్ హారర్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఎం.ఎస్. రాజు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో 'అగాధ'తో మరో భారీ విజయాన్ని అందుకునేలా కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రచార చిత్రాలతోనే ఇంతటి ఇంపాక్ట్ చూపించిన 'అగాధ', బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.