అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోర్టులో మరో భారీ షాక్ తగిలింది. తన దూకుడు నిర్ణయాలతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అలజడి సృష్టించిన ట్రంప్‌కు, న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్ట్ గట్టి షాకిచ్చింది. ట్రంప్ విధించిన 10 శాతం గ్లోబల్ టారిఫ్స్ చట్టవిరుద్ధమని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం 2-1 మెజారిటీతో తేల్చిచెప్పింది. ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కదారి పట్టిస్తూ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం చెల్లదని కోర్టు స్పష్టం చేయడంతో అమెరికా రాజకీయ, వాణిజ్య వర్గాల్లో తాజా తీర్పు హాట్ టాపిక్ గా మారింది.
గతంలో జాతీయ అత్యవసర పరిస్థితి చట్టాన్ని వాడుకుంటూ ట్రంప్ విధించిన టారిఫ్స్‌పై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ట్రంప్ తన అధికార పరిధిని మించి ప్రవర్తించారని తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ పట్టుదలకు పోయి మళ్లీ 10 శాతం సుంకాలను అమలులోకి తెచ్చారు. ఈ చర్యను సవాలు చేస్తూ పలు చిన్న వ్యాపార సంస్థలతో పాటుగా 24 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ ప్రభుత్వం కావాలనే సుప్రీంకోర్టు తీర్పును తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని వాదించాయి. తాజాగా ఫెడరల్ కోర్టు ఈ వాదనలతో ఏకీభవిస్తూ ట్రంప్ నిర్ణయం అక్రమమని ప్రకటించింది.
ఈ తీర్పుతో ప్రధానంగా వాషింగ్టన్ స్టేట్‌తో పాటు బేసిక్ ఫన్ అనే బొమ్మల కంపెనీ, బర్లాప్ & బారెల్ అనే మసాలా దినుసుల దిగుమతి సంస్థలకు పెద్ద ఊరట లభించింది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ద్వారా పన్నులు చెల్లించిన ఆధారాలను చూపడంతో ఆ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అక్రమ టారిఫ్స్ వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసులో అనిశ్చితి ఏర్పడిందని, ఈ తీర్పు వల్ల తమ వంటి చిన్న వ్యాపారాలకు కొంత స్థిరత్వం లభిస్తుందని బాధిత కంపెనీలు చెబుతున్నాయి..
కోర్టు తీర్పులో ఒక కీలకమైన ట్విస్ట్ ఉంది. కోర్టు ఈ స్టేను అందరికీ వర్తింపజేయకుండా కేవలం పిటిషన్ వేసిన వారికి మాత్రమే పరిమితం చేసింది. దీనివల్ల మిగిలిన దిగుమతిదారులు జూలై 24న ఈ టారిఫ్స్ గడువు ముగిసే వరకు సుంకాలు చెల్లించాల్సిందే. ఈ వివక్షపై ఇతర కంపెనీలు కూడా కోర్టుకు వెళ్లే అవకాశం ఉండటంతో.. రానున్న రోజుల్లో మరిన్ని న్యాయపోరాటాలు జరిగేలా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం తాజా తీర్పుపై పైకోర్టుకు వెళ్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మెుత్తానికి ట్రంప్ దూకుడుకు అక్కడి కోర్టుల నుంచి వరుస బ్రేక్స్ పడుతుందటం వ్యాపారులకు స్వల్ప ఊరటను అందిస్తోంది.
