- కురిసినా కొంత ఏరియాకే పరిమితం
- పక్క పక్క గ్రామాలు, మండలాల్లోనే తేడాలు
- రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దయనీయ పరిస్థితులు
- ఒక మండలంలో దండిగా పడితే మరో మండలంలో తీవ్ర లోటు
- సగటు వర్షపాతం నమోదవుతున్నా పెరగని గ్రౌండ్ వాటర్
- నిరుడు జూలైతో పోలిస్తే 1.11 మీటర్ల లోతున భూగర్భ జలాలు
- ఎల్‌నినో ఎఫెక్ట్ ఉందని.. వరి వద్దన్నా వినని రైతులు
- ప్రాజెక్టుల్లోనూ నీళ్లు లేవ్.. వర్షాల కోసం ఎదురుచూపులు
హైదరాబాద్, వెలుగు:మబ్బులు బాగానే వస్తున్నయ్.. వాన పడినట్టే పడ్తున్నది.. కానీ ఆ వెంటనే మబ్బులు గాయబ్.. ఎండ ఎంటర్..! ఈ ఊరిలో ఉన్న వర్షం.. పక్క ఊరిలో ఉండదు.. పక్క పక్క మండలాల్లోనూ ఎంతో తేడా! వర్షపాత సగటులోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రాన్ని యూనిట్‌గా చూస్తే వర్షపాతం సాధారణంగానే ఉంది. కానీ, కొన్ని జిల్లాల్లో భారీ లోటు కనిపిస్తున్నది. సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాల్లోని చాలా మండలాల్లోనూ లోటు వర్షపాతమే. ఒక మండలంలో సాధారణ వర్షపాతముంటే.. దాని పక్కనే ఉండే మరో మండలం లోటులో ఉన్నది. రాష్ట్రంలో ఇదీ వర్షాల మాయ.
హనుమకొండ, వరంగల్, జనగామ, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనైతే పరిస్థితి దయనీయంగా ఉన్నది. వాటికితోడు భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే ఉన్నది. అటు భూగర్భ జలాలూ పడిపోతున్నాయి. నిరుడితో పోలిస్తే ప్రస్తుతం 1.11 మీటర్లు దిగజారాయి. ఇటు ఏ ప్రాజెక్టులోనూ పూర్తి స్థాయిలో జలాలు లేవు. ఎగువ నుంచి వరదలు రాకపోవడం.. వచ్చినా ప్రాజెక్టులు నిండకమునుపే ఆగిపోవడంతో చాలా వరకు ప్రాజెక్టులు నిండలేదు. గోదావరిలో అత్యంత కీలకమైన శ్రీరాంసాగర్, కృష్ణాలో అతి ముఖ్యమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు ఇంకా వరదలే మొదలు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయకట్టు పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
250 మండలాల్లో లోటు
రాష్ట్రమంతటా ప్రస్తుతం సగటు వర్షపాతం సాధారణంగానే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కేవలం 9 శాతమే లోటుంది. 452 మిల్లీ మీటర్లకు గాను 412.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కానీ చాలా మండలాల్లో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 250 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నది. 7 మండలాల్లో అయితే వర్షపాత లోటు అత్యంత తీవ్రంగా ఉన్నది. భద్రాద్రి జిల్లాలోని 23 మండలాల్లో కేవలం 16 మండలాలు, ఆదిలాబాద్‌లో 21 మండలాల్లోని 11, మహబూబాబాద్‌లో 18 మండలాల్లో 14, వరంగల్‌లో అయితే 13కు 13 మండలాలు, హనుమకొండలో 14కు 14 మండలాలు, జనగామలో 12కు 11, యాదాద్రిలో 17కు 13, మేడ్చల్ లో 15కు 13, జోగుళాంబ గద్వాలలో 13కు 9, ఖమ్మంలో 21 మండలాలకుగానూ 19, నారాయణపేటలో 13కు 8, నల్గొండలో 33కు 17, సూర్యాపేటలో 23కు 15 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో మొత్తం కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. కేవలం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మాత్రమే అన్ని మండలాల్లోనూ వర్షాలు కవర్ అయ్యాయి. ఆ జిల్లాల్లోని ఏ మండలం కూడా వర్షపాత లోటుతో లేదు. అయితే, ఆసిఫాబాద్‌కు ఆనుకుని ఉండే ఆదిలాబాద్‌లో మాత్రం విభిన్నమైన పరిస్థితులుండడం గమనార్హం.
భూగర్భ జలాలూ పడిపోయినయ్
వర్షాలు కేవలం కొన్నిచోట్ల మాత్రమే పడడంతో నిరుడుతో పోలిస్తే భూగర్భజలాలు భారీగా తగ్గాయి. గత ఏడాది జులైతో పోలిస్తే భూగర్భజల మట్టం 1.11 మీటర్లు తగ్గింది. నిరుడు జులైలో భూగర్భజలాలు 8.37 మీటర్ల వద్దే లభ్యమైతే.. ఈ ఏడాది మాత్రం 9.48 మీటర్లకు పడిపోయాయి. వికారాబాద్ జిల్లాలో అయితే 14.39 మీటర్ల వద్దగానీ భూగర్భజలాల్లేవ్. మొత్తంగా 20 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్ల వద్ద.. 13 జిల్లాల్లో 10 నుంచి 15 మీటర్ల వద్ద భూమిలోపల నీళ్లు లభిస్తున్నాయి. నిరుడుతో పోలిస్తే అత్యధికంగా హైదరాబాద్‌లో జలాలు పడిపోయాయి. సిటీలో నిరుడు ఇదే టైమ్‌కు 8.03 మీటర్ల వద్ద నీళ్లుండగా.. ఇప్పుడు 12.63 మీటర్లకు పడిపోయింది. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 3.55 మీటర్లు పడిపోయాయి. ఆ జిల్లాలో 9.72 మీటర్ల వద్ద నీళ్లు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 2.56 మీటర్లు, భూపాలపల్లిలో 2.68 మీటర్లు, సిరిసిల్లలో 3.30 మీటర్ల మేర భూగర్భజలాలు పడిపోయాయి. కేవలం జనగామ, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లోనే పెరిగాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 0.19 మీటర్ల నుంచి 4.22 మీటర్ల వరకు భూగర్భజలాలు పడిపోయాయి.
వద్దన్నా వరికే మొగ్గు..
ఎల్‌నినో నేపథ్యంలో ప్రభుత్వం ముందు నుంచీ ఆరుతడి పంటలు వేయాలని రైతులకు చెప్తూ వచ్చింది. వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశముందని, వరిని వీలైనంత వరకు తగ్గించాలని సూచించింది. కానీ, గత ఏడాది ఇదే టైమ్‌తో పోలిస్తే ఈ ఏడాది కూడా అదే స్థాయిలో రైతులు వరి వేశారు. గత ఏడాది ఈ టైమ్ వరకు 39.48 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడగా.. ఈ ఏడాది ఇప్పటికే 35.13 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అంటే ప్రభుత్వం, వ్యవసాయాధికారుల సూచనలను రైతులు పట్టించుకోలేదని స్పష్టమవుతున్నది. నాట్లు పడ్డాక తీరా ఇప్పుడు వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ వరుణుడు కరుణిస్తే తప్ప.. వరి జీవం పోసుకునేలా కనిపించడం లేదు.
