తొర్రూరు, వెలుగు: ఓ విత్తన కంపెనీ అంటగట్టిన ఆడ, మగ రకం మక్కజొన్న విత్తనాలు వేసి నష్టపోయిన రైతులు వినియోగదారుల సమాచార కేంద్రం సహాయంతో పోరాటం చేయగా పరిహారం దక్కింది. ఆశించిన దిగుబడి రాక నష్టం రావడంతో బాధిత రైతులు ఇటీవల వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ వింజమూరి సుధాకర్ ను కలిసి విత్తన కంపెనీపై ఫిర్యాదు చేశారు. విత్తన కంపెనీకి నోటీసులు పంపగా, వారు దిగివచ్చి రైతులకు పరిహారం అందజేశారు.
నరసింహులపేట మండలం చెందిన లోక్యా తండా, పెద్ద నాగారం గ్రామాలకు చెందిన భూక్యా సూక్యా, చావ కిరణ్ కుమార్, గుగులోతు లచ్చు, బానోత్ యాకూబ్, బానోత్ సోమ్లా, రేఖ ఐలయ్య, రేఖ యాకయ్య 24 ఎకరాల్లో రూ.14.40 లక్షల పెట్టుబడితో పంట సాగు చేశారు. రూ.26 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా, రూ.11 లక్షలు మాత్రమే వచ్చాయని, రూ.15 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. కంపెనీ ప్రతినిధులు నష్టాన్ని అంచనా వేసి రూ.15 లక్షలు పరిహారం కింద రైతులకు అందజేసినట్లు చైర్మన్ తెలిపారు. గురువారం అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ సమక్షంలో రైతులకు చెక్కులు అందజేశారు.
