సెంచరీతో చెలరేగిన దేవదత్..ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 357/6
రాణించిన జడేజా, మానవ్ సుతార్, రాహుల్..జైస్వాల్, పంత్, జురెల్ ఫెయిల్
కొలంబో: శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ (164 బాల్స్‌లో 18 ఫోర్లతో 142 బ్యాటింగ్) సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా (63) కూడా బ్యాట్ ఝుళిపించడంతో.. శనివారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 357/6 స్కోరు చేసింది. పడిక్కల్‌తో పాటు గుర్నూర్ బ్రార్ (36 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు లంక తొలి ఇన్నింగ్స్‌ను ఓవర్‌నైట్ స్కోరు 363/8 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఇండియా ఇంకా ఆరు రన్స్ వెనకబడి ఉంది.
జైస్వాల్ డకౌట్..
బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) ఇన్నింగ్స్ రెండో బాల్‌కే డకౌటయ్యాడు. దాంతో 1/0 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన పడిక్కల్, రాహుల్‌తో కలిసి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. భారీ షాట్లకు పోకుండా స్టైలిష్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. రెండు ఫుల్ లెంగ్త్ బంతులను కవర్ డ్రైవ్స్‌గా మలిచిన పడిక్కల్ పాయింట్ ముందు, వెనకాల అద్భుతమైన కట్ షాట్లు ఆడాడు. ముఖ్యంగా రైట్ ఆర్మ్ పేసర్ ఇషిత విజయసుందర బౌలింగ్‌లో వరుసపెట్టి బౌండ్రీలు బాదాడు. పేసర్లు వేసిన షార్ట్ పిచ్‌లను సైతం చూడచక్కని ఫుల్‌షాట్లుగా మలిచాడు. ఇందులో నటరాజ్ షాట్ కూడా ఉండటం విశేషం. స్పిన్నర్ల బౌలింగ్‌లో బలమైన డిఫెన్స్‌తో పాటు మంచి ఫుట్‌వర్క్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఎండ్‌లో రాహుల్ కూడా తన ట్రేడ్ మార్క్ షాట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 96 రన్స్ జోడించి 24వ ఓవర్‌లో వెనుదిరిగాడు. ఈ దశలో వచ్చిన జడేజా కూడా ఆకట్టుకున్నాడు. స్పిన్ బౌలింగ్ సామర్థ్యం తగ్గినా.. విదేశాల్లో మిడిలార్డర్ బ్యాటర్‌గా తాను చాలా విలువైన ప్లేయరని నిరూపించుకున్నాడు. ఇక ఆఫ్ స్పిన్నర్ రమేష్ మెండిస్ (2/77) బౌలింగ్‌లో సూపర్ ఫుల్‌షాట్ కొట్టిన పడిక్కల్ 121 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేశాడు. మూడో వికెట్‌కు 72 రన్స్ జోడించి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
చేతులెత్తేసిన కీపర్లు
తుది జట్టులోకి వచ్చిన ఇద్దరు కీపర్లు రిషబ్ పంత్ (2), ధ్రువ్ జురెల్ (1) ఘోరంగా నిరాశపర్చారు. ఓ ఎండ్‌లో జడేజా పాతుకుపోయినా.. రెండో ఎండ్‌లో 15 బాల్స్ తేడాలో ఈ ఇద్దరూ వెనుదిరిగారు. మెండిస్ బౌలింగ్‌లో బంతి టర్న్‌కు వ్యతిరేకంగా షాట్ కొట్టిన పంత్ లాంగాన్‌లో ఫెర్నాండో చేతికి చిక్కాడు. ఆ వెంటనే జురెల్ బాల్‌ను డిఫెన్స్ చేసే క్రమంలో లోపలి అంచుకు తాకి స్క్వేర్ లెగ్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. పెరీరా రెండో ప్రయత్నంలో క్యాచ్ అందుకున్నాడు. దాంతో ఇండియా 174/5తో కష్టాల్లో పడింది. జడేజాతో కలిసి మానవ్ సుతార్ (41) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి మ్యాచే అయినా అనుభవజ్ఞుడిలా లంక బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నాడు. జడేజాతో కలిసి ఆరో వికెట్‌కు 76 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. తర్వాత జడేజా రిటైర్డ్ హర్ట్ కాగా, కుల్దీప్ యాదవ్ (1), మహ్మద్ సిరాజ్ (1) ఫెయిలయ్యారు. తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన పడిక్కల్.. సారాన్ష్ జైన్ (22), గుర్నూర్ బ్రార్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. రెండు కీలక భాగస్వామ్యాలతో మంచి స్కోరు అందించాడు. అసంక మనోజ్ 2, విశ్వా ఫెర్నాండో, కేశారా నువాంత చెరో వికెట్ తీశారు.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 90 ఓవర్లలో 363/8 డిక్లేర్డ్ (రవీందు 71, నిషాన్ 66, మానవ్ సుతార్ 2/33). ఇండియా: 90 ఓవర్లలో 357/6 (దేవదత్ పడిక్కల్ 142 బ్యాటింగ్, బ్రార్ 36 బ్యాటింగ్, అసంక మనోజ్ 2/32).
