- దేశవ్యాప్తంగా జమాత్ ఇ ఇస్లామీ ఆధ్వర్యంలో ఆందోళనలు
- దద్దరిల్లిన కరాచీ, లాహోర్, పెషావర్, క్వెట్టా, ఇస్లామాబాద్, రావల్పిండి సిటీలు
పాకిస్తాన్‌లో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోలియం లెవీ, పెరుగుతున్న ధరలను వ్యతిరేకిస్తూ జమాత్- ఇ -ఇస్లామీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కరాచీ, లాహోర్, పెషావర్, క్వెట్టా, ఇస్లామాబాద్, రావల్పిండి, అబోటాబాద్‌లలో ప్రధాన హైవేలు, రోడ్లపై ప్రదర్శనలు, సిట్-ఇన్‌లు, ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. దీంతో ఆయా నగరాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోలియం లెవీ, పెరుగుతున్న ధరలను వ్యతిరేకిస్తూ జమాత్- ఇ -ఇస్లామీ ఆధ్వర్యంలో శుక్రవారం పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. కరాచీ, లాహోర్, పెషావర్, క్వెట్టా, ఇస్లామాబాద్, రావల్పిండి, అబోటాబాద్‌లలో ప్రధాన హైవేలు, రోడ్లపై ప్రదర్శనలు, సిట్-ఇన్‌లు, ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. దీంతో ఆయా నగరాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక వెల్లడించింది. ‘‘ఇక చాలు, లెవీని వెనక్కి తీసుకోండి. ఉపశమనం కల్పించండి’’ అనే ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు.
దీంతో ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతిదూతగా పేరు పొందాలని చూస్తున్న ప్రభుత్వానికి మరోవైపు స్వదేశంలో పెరుగుతున్న ప్రజాగ్రహం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వ పన్ను విధానాలను జమాత్- ఇ- ఇస్లామీ చీఫ్ హాఫిజ్ నయీమ్ -ఉర్ -రెహమాన్ ఖండించారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆయన క్యాబినెట్‌కు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ‘‘ఈ ప్రభుత్వం, దీనికి ముందున్న ప్రభుత్వం, దానికి ముందున్న ప్రభుత్వం అన్నీ ఒకే గందరగోళంలో ఉన్నాయి. అందుకే ఈ లెవీ ఆమోదయోగ్యం కాదు. ఈ లెవీ పన్నును రద్దు చేయాల్సిందే” అని ప్రభుత్వానికి ఆయన స్పష్టం చేశారు.
పెట్రోలియం లెవీ ద్వారా ప్రభుత్వం 8 ట్రిలియన్ పాకిస్తానీ రూపాయలను వసూలు చేసిందని రెహమాన్ ఆరోపించారు. తన అసమర్థతను, అవినీతిని దాచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పాక్‌కు బిలియన్ల డాలర్ల బెయిలవుట్‌లను అందించిన అంతర్జాతీయ ద్రవ్య నిధి లెవీని తగ్గించడానికి అనుమతించదన్న ప్రభుత్వ వాదనను కూడా ఆయన తిరస్కరించారు.
తీవ్రమైన ఇంధన ధరలు, పెట్రోలియం లెవీ, అధిక విద్యుత్ టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఆదివారం నాడు లాహోర్‌లోని పంజాబ్ సీఎం ఇల్లు అలాగే కరాచీ, పెషావర్, క్వెట్టాలోని గవర్నర్ ఇళ్ల వెలుపల సిట్-ఇన్‌లు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరమైతే సిట్-ఇన్‌లను పొడిగించవచ్చని రెహమాన్ హెచ్చరించారు.
లెవీతో జనంపై మరింత భారం
పాక్ ప్రభుత్వం మార్చి నుంచి ప్రతి వారం పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నది. హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా చమురు కొరత ఏర్పడడంతో కోత చర్యలను అమలు చేస్తున్నది. ఏప్రిల్‌లో లీటరు పెట్రోల్ ధర 459 పాకిస్తానీ రూపాయలకు తాకింది. డీజిల్ ధర లీటరుకు 520.35 చేరుకుంది.
