న్యూయార్క్: యునైటెడ్ నేషన్స్ (యూఎన్) భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు యూరప్‌కు చెందిన వైసెగ్రాడ్ 4 (వీ4) దేశాలు మద్దతు ప్రకటించాయి. మధ్య యూరప్‌లోని పోలెండ్, హంగేరీ, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా దేశాల సమూహాన్ని వైసెగ్రాడ్4 గా పేర్కొంటారు. ఈ దేశాలు ప్రాంతీయ సహకారం, ఆర్థికం, రాజకీయాలు, భద్రత వంటి అంశాల్లో కలిసి పనిచేస్తాయి.
81వ యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫస్ట్‌టైమ్ జరిగిన వీ4–ఇండియా మంత్రుల భేటీలో ఈ మద్దతు వెల్లడైంది. స్లొవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానర్ మాట్లాడుతూ.. గ్లోబల్ సౌత్‌లో భారత్ కీలక దేశమని, ఇండో–పసిఫిక్‌లో ఎదుగుతున్న శక్తి అని చెప్పారు.
అందుకే భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం ఉండాలని వీ4 దేశాలు అంగీకరించాయని తెలిపారు. ఈ సమావేశంలో పోలెండ్ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీ, హంగేరీ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి డాక్టర్ అనితా ఓర్బాన్, స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానర్, చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి పీటర్ మసింకా పాల్గొన్నారు.
వీ4 దేశాలతో కలిసి పనిచేయాలనుకుంటున్నం
తొలి వీ4–ఇండియా సమావేశం కొత్త చరిత్రాత్మక సందర్భాన్ని సృష్టించిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. బలమైన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలు, టెక్నాలజీ, ఇన్నోవేషన్ కెపాసిటీ ఉన్న వీ4 దేశాలతో ఇండియా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నదన్నారు. ఏటా విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించాలని, వార్షిక బిజినెస్ ఫోరం ఏర్పాటుచేయాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి.
రక్షణ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు టెక్నాలజీ, ఇన్నోవేషన్, స్పేస్, కనెక్టివిటీ, విద్య, సంస్కృతి, ప్రజల మధ్య రాకపోకలపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఉక్రెయిన్ యుద్ధం, గల్ఫ్ ప్రాంత పరిణామాలపైనా చర్చించారు. కాగా, ప్రస్తుతం యూఎన్ భద్రతా మండలిలో చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా శాశ్వత సభ్యులుగా ఉన్నాయి.
