చందానగర్, వెలుగు: నానమ్మ బతికుండగానే ఆమెకు డెత్ సర్టిఫికెట్ సృష్టించి, బాబాయ్ పెళ్లి కాకుండానే చనిపోయాడంటూ తప్పుడు పత్రాలు తయారు చేసి ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని శేరిలింగంపల్లి కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దుర్గం శ్రీహరి గౌడ్‌పై ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారం కోర్టు వివాదంలో ఉండగా.. తనపై ఫిర్యాదు చేసిన బాబాయ్ భార్య, ఆమె కొడుకుపై శ్రీహరిగౌడ్ దాడికి పాల్పడినట్లు బాధితులు వాపోయారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి మండలం తారానగర్‌లో శ్రీహరి గౌడ్ నానమ్మ పేరుపై ఇల్లు ఉంది. ఈ ఇంటిని దక్కించుకునేందుకు నానమ్మ బతికుండగానే ఆమె చనిపోయినట్లు, ఆమె రెండో కొడుకు పెళ్లి కాకుండానే మృతిచెందినట్లు శ్రీహరిగౌడ్ తప్పుడు పత్రాలు సృష్టించారు.
2018లో తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న చిన్నాన్న కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఇంటి పై అంతస్తులో శ్రీహరి గౌడ్ కుటుంబం నివాసం ఉండగా, కింది అంతస్తును బాబాయ్ కుటుంబం అద్దెకు ఇచ్చింది.
గురువారం ఇంటి వద్ద మౌనిక, సాయి చరణ్‌పై శ్రీహరి గౌడ్ తన సోదరుడు సతీష్‌తో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. దీంతో మౌనిక చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు మౌనిక తమ కుటుంబ సభ్యులను నిత్యం దూషిస్తోందని, తమపై దాడి చేసి పరారైందని శ్రీహరి గౌడ్ కుటుంబం కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
