హైదరాబాద్, వెలుగు: పీసీసీలో సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మూడు రోజుల కింద సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్, మీడియా కమిటీ చైర్మన్‌గా చామల కిరణ్ కుమార్ రెడ్డిని నియమించిన పార్టీ నాయకత్వం.. తాజాగా మరో రెండు నియామకాలు చేపట్టింది. పీసీసీ సోషల్ జస్టిస్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, పీసీసీ సంఘటన్ శ్రీజన్ అభియాన్ చైర్మన్‌గా వేణుగోపాల్‌ను నియమిస్తూ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ శనివారం ప్రకటన జారీ చేశారు. ఈ నెల 17 నుంచి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తుండడంతో ఆలోపే పార్టీ పదవులను భర్తీ చేయనున్నారు. తిరిగి వచ్చిన తర్వాత సుమారు పది వరకు నామినేటెడ్ పదవుల నియామక ప్రకటన చేయనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లతోపాటు పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ నియామకం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నారని, వీరిలో ఒక్కో సామాజిక వర్గం నుంచి ఒకరిని నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇందులో ఎస్సీ కోటాలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎస్టీ కోటాలో ఎంపీ బలరాంనాయక్ లేదంటే ఆదివాసీ నేత బెల్లయ్యనాయక్, మైనార్టీ కోటాలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొత్వాల్ ఒబేదుల్లా లేదంటే వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా, రెడ్డి సామాజిక వర్గం నుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి లేదా ఖైరతాబాద్ డీసీసీ మాజీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
