ఓరుగల్లుపై ఎల్నినో ఎఫెక్ట్!ఈసారి రాష్ట్రంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి తక్కువ వానలు

ఓరుగల్లుపై ఎల్నినో ఎఫెక్ట్!ఈసారి రాష్ట్రంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి తక్కువ వానలు
  •   ఎక్కడా లేనివిధంగా హనుమకొండ జిల్లాలో 
  • 44 శాతం లోటు వర్షపాతం నమోదు
  •     వరంగల్ లో 40 శాతం, ఆ తర్వాతి స్థానాల్లో జనగామ, మహబూబాబాద్
  •     ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో సాధారణానికి మించని వర్షపాతం
  •     జల సంరక్షణ చర్యలపై దృష్టి పెడితేనే మేలు

హనుమకొండ, వెలుగు: ఓరుగల్లుపై ఎల్ నినో ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంది. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు దాటినా ఇంతవరకు చెప్పుకోదగ్గ వర్షాలు లేవు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక లోటు వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాత స్థానాల్లో వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఇటీవల వర్షాలు కురిసినా సాధారణ వర్షపాతమే నమోదు కావడం గమనార్హం. ఇదిలాఉంటే ఆకాశం మేఘావృతమవుతున్నా చిరుజల్లులు మాత్రమే పడుతుండటం కలవరానికి గురి చేస్తుండగా, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా  భవిష్యత్తును దృష్టి పెట్టుకుని నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 

రాష్ట్రంలోని 9 జిల్లాల్లో లోటు..

ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా జూన్ ఫస్ట్ వీక్ నుంచే జోరు వానలు కురవాల్సి ఉండగా, రాష్ట్రంలోని చాలాచోట్ల ఇంతవరకు పెద్ద వానలు మాత్రం పడలేదు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు పడగా, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మాత్రమే సాధారణకంటే అధిక వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతమే నమోదు కాగా, రాష్ట్రం మొత్తం మీద తొమ్మిది జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డ్ అయ్యింది. ఇలా లోటు వర్షపాతం నమోదైన జాబితాలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలున్నాయి. 

హనుమకొండలోనే లోయెస్ట్..

ఎల్ నినో ప్రభావంతో ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోనే అతి తక్కువ వానలు కురిశాయి. తెలంగాణ డెవలప్మెంట్ ప్లాన్ సొసైటీ లెక్కల ప్రకారం జూన్ నుంచి ఇప్పటివరకు హనుమకొండ జిల్లాలో సాధారణ వర్షపాతం 464.7 మిల్లీమీటర్లు నమోదు కావాలి. కానీ, ఇంతవరకు కేవలం 261.5 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. దీంతో రాష్ట్రంలోనే అతి తక్కువ వానలతో హనుమకొండ జిల్లాల్లో 44 శాతం లోటు వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా సాధారణ వర్షపాతం 492.2 మి.మీ కాగా, 292.9 మాత్రమే నమోదైంది. ఫలితంగా ఇక్కడ 40 శాతం లోటు కనిపిస్తోంది. ఆ తర్వాత జనగామ జిల్లాలో 368.8 మి.మీలకు బదులు 228.9 మి.మీ వర్షంతో 38 శాతం లోటు నమోదవగా, మహబూబాబాద్ జిల్లాలో 460.3 మి.మీకి బదులు 343.5మి.మీలతో 25 శాతం తక్కువ వర్షపాతం కనిపిస్తోంది. ఇక ములుగు జిల్లాలో 684.1 మి.మీలకు 705.8మి.మీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 554.2మి.మీలకు 567 మి.మీలతో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా లోటు వర్షపాతమే ఉంది. ఖమ్మం జిల్లాలో 29 శాతం లోటు కనిపిస్తుండగా, భద్రాద్రి కొత్తగూడెంలో 24 శాతం లోటు నమోదైంది. 

నాలుగు మండలాల్లో అతి లోటు..

రాష్ట్రంలో నాలుగు మండలాల్లో అతి లోటు వర్షపాతం నమోదైంది. ఇందులో హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం, నల్గొండ జిల్లా కేతేపల్లిలో 66 శాతం లోటు వర్షపాతం కనిపిస్తోంది.  జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో 62 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 'తెలంగాణ జలసిరి' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎల్ నినోను ఎదుర్కొనేందుకు వీబీ జీ రాంజీ స్కీం కింద ఇప్పటికే ఇంటింటా ఇంకుడు గుంతలు, బోర్ వెల్ రీఛార్జ్ స్ట్రక్షర్స్, ఫాం పాండ్స్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు భూగర్భ జలాలను పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో ఎదురైన వర్షాభావ పరిస్థితులను భవిష్యత్తులోనూ ఎదుర్కొనేందుకు ప్రజలు కూడా అవగాహనతో మెలగాలని భూగర్భ జల శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నీటిని ఒడిసిపట్టేందుకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా సూచిస్తున్నారు.