హైదరాబాద్ సిటీ, వెలుగు: లాల్ దర్వాజా బోనాల సందర్భంగా ఆదివారం, సోమవారం పాతబస్తీలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. మదీనా ఎక్స్‌రోడ్స్ నుంచి ఇంజిన్‌బౌలి వరకు ప్రధాన రహదారిని పూర్తిగా మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.
దర్బార్ మైసమ్మ బోనాల సందర్భంగా కార్వాన్‌లో సోమవారం వరకు, అంబర్‌పేట మహంకాళి ఆలయం వద్ద సోమవారం మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. చిలకలగూడ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయం వద్ద రెండు రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయన్నారు.
పాతబస్తీ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. భక్తుల కోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వాహనదారులు ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ అత్యవసర సహాయం కోసం 9010203626 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు కోరారు.
స్పెషల్ బస్సులు..
ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు జరిగే బోనాల జాతరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అంబర్‌పేట బోనాలకు వచ్చే భక్తుల కోసం రూట్ నంబర్లు 113ఎం, 113కె/ఎల్ బస్సులను అంబర్‌పేట ఫ్లైఓవర్ మీదుగా నడపనున్నట్లు తెలిపారు. రూట్ నంబర్ 107వీ బస్సులను జిందా తిలిస్మాత్, మూసారంబాగ్ మీదుగా, రూట్ నంబర్ 115 బస్సులను అంబర్‌పేట పోలీస్‌లైన్స్, రామంతాపూర్ మీదుగా నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
