- ఇల్లు ఇప్పిస్తామంటూ రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూళ్లు
- ముందుగా సగం.. ఇల్లు వచ్చాక సగం అంటూ బురిడీ
- ఓల్డ్ సిటీలో నకిలీ పట్టాలతో మోసగాడు అరెస్ట్
- మధ్యవర్తులను నమ్మొద్దని సూచిస్తున్న అధికారులు
సొంతింటి కలను నిజం చేసుకోవాలనే పేదల ఆశను కొందరు మోసగాళ్లు ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. డబుల్ బెడ్‌రూమ్, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తామంటూ దరఖాస్తుదారులను లక్ష్యంగా చేసుకుని రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు.
అధికారులతో పరిచయాలున్నాయంటూ నమ్మించి అడ్వాన్స్ పేరుతో డబ్బులు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ పథకాల కింద ఇల్లు పొందేందుకు ఒక్క రూపాయి కూడా మధ్యవర్తులకు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ సిటీ, వెలుగు: డబుల్ బెడ్‌రూమ్, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామంటూ కొందరు కేటుగాళ్లు అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో ఇంటికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అధికారులతో పరిచయాలు ఉన్నాయని, డబ్బులు ఇస్తే జాబితాలో పేరు చేర్చి ఇల్లు మంజూరు చేయిస్తామని నమ్మబలుకుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. వారం క్రితం ఓల్డ్ సిటీలో ఇలాంటి మోసానికి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి 52 నకిలీ ఇంటి పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇండ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై పోలీసులు దృష్టి పెట్టారు.
దరఖాస్తుదారులే టార్గెట్..
గ్రేటర్ పరిధిలో 111 ప్రాంతాల్లో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 49 మురికివాడల్లో 9,828, 68 ఖాళీ స్థలాల్లో 90,172 ఇండ్ల నిర్మాణం చేపట్టింది. 70 వేల ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, 66 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. మరికొన్ని నిర్మాణంలో ఉండగా, ఇంకొన్ని పెండింగ్‌లో ఉన్నాయి.
గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కోసం 2017 నుంచి 2019 మధ్య 7.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 95 వేల మందిని అర్హులుగా గుర్తించి ఇండ్లు కేటాయించగా, మరో 20 వేల మందికి ఇళ్లు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో లక్షల్లో అప్లికేషన్లు వచ్చాయి. దీంతో దరఖాస్తుదారులనే టార్గెట్‌గా చేసుకుని కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు.
మహిళకు వల.. రూ.లక్ష డిమాండ్..
మారేడ్‌పల్లికి చెందిన ఓ మహిళ ప్రజాపాలనలో భాగంగా 2023 డిసెంబర్‌లో 142వ వార్డులో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంది. భర్త లేక ఇంటి అద్దెలు చెల్లించలేక సొంత ఇల్లు కోసం ఆమె కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఓ పార్టీకి చెందిన నాయకుడు నాచారం, ఉప్పల్, బండ్లగూడలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో ఇల్లు ఇప్పిస్తానంటూ ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు.
ముందుగా రూ.50 వేలు, ఇల్లు మంజూరైన తర్వాత మరో రూ.50 వేలు ఇవ్వాలని అడిగాడు. అనుమానం వచ్చిన మహిళ పలువురిని సంప్రదించగా ఇది మోసమని తేలడంతో డబ్బులు ఇచ్చేందుకు వెనక్కి తగ్గింది.
నమ్మి మోసపోవద్దు..
ప్రభుత్వ పథకాల కింద ఇళ్లు మంజూరు చేయడానికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే చెల్లించకుండా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. మధ్యవర్తుల మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, డబ్బులు తీసుకుని ఇళ్లు ఇప్పిస్తామనే హామీలను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు.
