పేలిన బెలూన్‌ గ్యాస్‌ సిలిండర్‌..తెగి పడ్డ వ్యక్తి కాలు.. మియాపూర్ లో ఘటన

పేలిన బెలూన్‌ గ్యాస్‌ సిలిండర్‌..తెగి పడ్డ వ్యక్తి కాలు.. మియాపూర్ లో ఘటన
  • మరో ముగ్గురికి గాయాలు

మియాపూర్‌, వెలుగు: మియాపూర్‌ జాతీయ రహదారి వెంట జీఎస్‌ఎం మాల్‌ సమీపంలో బెలూన్లలో గ్యాస్‌ నింపుతుండగా సిలిండర్‌ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి కాలు కింది భాగం తెగిపడగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. యూపీకి చెందిన అవినాష్‌ సైకిల్‌పై గ్యాస్‌ సిలిండర్‌ పెట్టుకుని బెలూన్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. 

శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో బెలూన్లలో గ్యాస్‌ నింపుతుండగా సిలిండర్‌ పేలిపోయింది. దీంతో పక్కనే ఐస్‌క్రీం విక్రయిస్తున్న యూపీకి చెందిన వివేక్‌పాల్‌ కుడికాలికి సిలిండర్‌ ముక్క తగలడంతో కింది భాగం తెగిపోయింది. అతడిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

అదే సమయంలో మాల్‌కు వెళ్తున్న కొండాపూర్‌కు చెందిన ఎం.జనార్దన్‌, కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ధనుష అనే విద్యార్థిని, మాల్‌కు కారులో వచ్చిన విన్నకొండ సింధూప్రియకు గాయాలయ్యాయి. వారిని పోలీసులు సమీప ఆస్పత్రులకు తరలించారు. బెలూన్లు విక్రయిస్తున్న అవినాష్‌ చేతికి కూడా గాయాలయ్యాయని మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ జయరాం తెలిపారు.