ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల అంటే గ్రామానికి గుండె. అక్కడి నుంచే డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు, ఉపాధ్యాయులు తయారయ్యారు. కానీ నేడు ఆ గుండె చప్పుడు నెమ్మదిస్తోంది. క్లాస్‌రూమ్‌లు ఖాళీ అవుతున్నాయి. విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఇది కేవలం గణాంకాల సమస్య కాదు. ఇది భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. తల్లిదండ్రుల ఆకాంక్ష సహజం. తమ పిల్లలకు మెరుగైన ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ సౌకర్యాలు, పోటీ పరీక్షల శిక్షణ కావాలని కోరుకుంటున్నారు. ఆ కారణంగానే ప్రైవేట్ పాఠశాలల వైపు అడుగులు వేస్తున్నారు.
ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గి, ఉపాధ్యాయుల బదిలీలు, పాఠశాలల విలీనం, మూసివేత వంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు చేయాల్సింది నమ్మకం పునరుద్ధరణ.ప్రభుత్వ పాఠశాలల్లో వస్తున్న మంచి ఫలితాలను ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలి. తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచాలి. గుణాత్మక విద్య ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ, పాఠ్యప్రణాళికలో ఆధునికత, ఫలితాల బాధ్యత తప్పనిసరి. సౌకర్యాల కల్పన ప్రతి పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్లు, తాగునీరు, లైబ్రరీ, ఇంటర్నెట్.
సమాజ భాగస్వామ్యం, పూర్వ విద్యార్థులు, స్థానిక సంస్థలు, సీఎస్ఆర్ నిధులు పాఠశాలల అభివృద్ధికి వాడాలి. ప్రభుత్వ పాఠశాలల బలహీనత ప్రభుత్వానిది మాత్రమే కాదు. అది మొత్తం సమాజం యొక్క బాధ్యత. ఈ రోజు మనం పట్టించుకోకపోతే, రేపు సమాన అవకాశాల తలుపులు మూసుకుపోతాయి.
-ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
