- ఇప్పటికే 35.13 లక్షల ఎకరాల్లో నాట్లు
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని, వరికి సాగునీరు అందించే అవకాశం ఉండదని సర్కారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరించినా, రైతులు వరి సాగుకే ప్రయారిటీ ఇస్తున్నారు.
వరికి బదులుగా తక్కువ నీటితో పండే కంది, పెసర, సోయా, మక్కజొన్న తదితర పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. అయిన్పపటికీ ఇటీవల వరుసగా వానలు పడుతుండడంతో రైతులు వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో వరి సాగు ఇప్పటికే35.13 లక్షల ఎకరాలకు చేరింది.
20 రోజుల్లో 20 లక్షల ఎకరాలు..
జూన్ మొదట్లో వానలు ముఖం చాటేయడంతో ఈసారి వరి సాగు సగానికి పడిపోతుందని అంచనా వేశారు. కానీ, ఆగస్టులో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వర్షాలు పడుతుండడంతో వరినాట్లకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే నారు సిద్ధం చేసుకున్న రైతులు వర్షాలను చూసి నాట్లు మొదలుపెట్టారు. దీంతో గత 20 రోజుల్లోనే దాదాపు 20 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశా. శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 35.13 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి.
మొత్తం సాగులో మూడో వంతు వరే..
రాష్ట్రంలో శుక్రవారం నాటికి 99.81 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో ఒక్క వరి సాగు 35.13 లక్షల ఎకరాలు ఉంది. అంటే మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 35 శాతం వరే కావడం గమనార్హం. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నా పెద్దఎత్తున వరి సాగు చేస్తున్నారు. ప్రభుత్వం తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నా.. రైతులు మాత్రం వర్షాలు కురుస్తుండడంతో వరినే ఎంచుకుంటున్నారు.
సగానికి పడిపోతుందనుకుంటే..
ఈ వానాకాలంలో వరి సాగు గతంతో పోలిస్తే సగానికి తగ్గుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఎల్‌నినో కారణంగా వర్షాలు తగ్గితే వరికి నీరు అందించడం కష్టమవుతుందని భావించారు. దీంతో రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. కానీ, అనూహ్యంగా వర్షాలు పడుతుండడంతో పరిస్థితి మారిపోయింది.
ఆగస్టులో కురిసిన వర్షాలు వరి సాగుకు కలిసొచ్చాయి. ఫలితంగా వరి సాగు తగ్గకపోగా భారీగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వరి సాగు దాదాపు 4.35 లక్షల ఎకరాలు తగ్గిన్పపటికీ, వర్షాభావ పరిస్థితుల అంచనాల నేపథ్యంలో చూస్తే 35.13 లక్షల ఎకరాల్లో వరి సాగు కావడం వ్యవసాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సాధారణ సాగు కంటే తక్కువే!
రాష్ట్రంలో వానాకాలం సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాలు. గత ఏడాది ఇదే సమయానికి 1.02 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈసారి జూన్‌లో వర్షాలు లేకపోవడంతో సాగు ప్రక్రియ నెమ్మదించింది. తాజాగా వానలు కురుస్తుండడంతో సాగు ఊపందుకున్నా.. ఇప్పటి వరకు 99.81 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 2.42 లక్షల ఎకరాలు
వెనకబడి ఉంది.
పత్తి తర్వాత వరికే పెద్దపీట..
ఈ సీజన్‌లో అత్యధికంగా 47.24 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఆ తర్వాత వరి 35.13 లక్షల ఎకరాలతో రెండో స్థానంలో ఉంది. 5.18 లక్షల ఎకరాల్లో మక్కజొన్న, 4.90 లక్షల ఎకరాల్లో కంది, 3.69 లక్షల ఎకరాల్లో సోయా సాగయ్యాయి. ఇతర పంటల సాగు మాత్రం పెద్దగా ఊపందుకోలేదు. పెసర 90 వేల ఎకరాల్లో సాగైంది. మిగతా పంటలు ఏవీ కనీసం 50 వేల ఎకరాల సాగు విస్తీర్ణాన్ని కూడా దాటలేదు.
మళ్లీ వానలు లేకపోతే సమస్యే
ప్రస్తుతం వానలు కురుస్తుండడంతో వరి సాగుకు నీటి కొరత కనిపించడం లేదు. కానీ, రానున్న రోజుల్లో వర్షాలు తగ్గితే అసలు సమస్య మొదలయ్యే అవకాశం ఉంది. వరి ఇతర పంటలతో పోలిస్తే అధిక నీటిని వినియోగిస్తుంది. పంట మధ్యలో నీటి అవసరం పెరిగితే రైతులపై ఒత్తిడి పడే ప్రమాదం ఉంది.
అందుకే వర్షాలు పడుతున్నాయన్న కారణంతో వరి వైపు వెళ్లకుండా.. సీజన్ మొత్తం నీటి లభ్యతను అంచనా వేసుకొని పంటలు ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పడితే వరికి పూర్తి స్థాయిలో నీటిని అందించడం కష్టంగా మారుతుందని అంటున్నారు.
