లోయర్‌‌‌‌ మానేరుకు మిడ్‌‌మానేరు నీళ్లు.. LMDకి 5,600 క్యూసెక్కుల వరద

లోయర్‌‌‌‌ మానేరుకు మిడ్‌‌మానేరు నీళ్లు.. LMDకి 5,600 క్యూసెక్కుల వరద

కరీంనగర్, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిధిలోని మిడ్ మానేరు నుంచి కరీంనగర్‌‌‌‌లోని ఎల్ఎండీలోకి నీళ్ల రాక పెరిగింది. శుక్రవారం మిడ్ మానేరు నుంచి 2 వేల క్యూసెక్కులు విడుదల చేయగా.. శనివారం 5 వేల క్యూసెక్కులకు పెంచారు. ప్రస్తుతం మోయతుమ్మెద వాగు నుంచి 300 క్యూసెక్కుల వరద వస్తుండడంతో, మొత్తంగా ఎల్‌‌ఎండీకి 5,300 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 

ఎల్ఎండీ పూర్తి స్థాయి నిల్వ సామర్ధ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.135 టీఎంసీలకు చేరింది. ఎల్‌‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఎల్‌‌ఎండీ నుంచి దిగువకు సాగునీటి అవసరాలకు నీళ్లు విడుదల చేసే ప్రణాళికను ఇరిగేషన్​శాఖ ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం వచ్చే నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. 

ఆగస్టు 9న కడెం నుంచి నీటి విడుదల


జన్నారం, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నుంచి ఆదివారం ఉదయం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నీటిని విడుదల చేయనున్నారు.  

సాగర్‌‌కు 50 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో


హాలియా, వెలుగు: నాగార్జునసాగర్  ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభమైంది. శనివారం సాయంత్రం 6 గంటలకు సాగర్‌‌లోకి 50,317 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 516.20 అడుగులకు చేరగా.. నీటి నిల్వ 142.4378 టీఎంసీలకు చేరింది. 

శ్రీశైలం డ్యాం నుంచి కుడి, ఎడమ గట్టు జల విద్యుత్  కేంద్రాల్లో విద్యుత్​ ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్ కు 50,317 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మెయిన్ పవర్  హౌస్  ద్వారా ఇప్పటివరకు నీటి విడుదల లేదు. 

ఎస్‌‌ఎల్‌‌బీసీ(ఏఎంఆర్పీ) ద్వారా 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో సాగర్  నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నాగార్జునసాగర్  ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని రైతులు వరద నీటి రాకతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.