హైదరాబాద్, వెలుగు: యూనిఫామ్ సర్వీసు నియామకాల వయోపరిమితి మరో నాలుగేళ్లకు పెంచాలని కోరుతూ శనివారం గాంధీ భవన్ ఎదుట నిరుద్యోగులు ధర్నా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూనిఫామ్ సర్వీసు వయోపరిమితిని రెండేళ్లకు పెంచారని, ఆ రెండేళ్ల కాలంలో పోలీసు ఉద్యోగాలకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదని నిరుద్యోగులు ఆరోపిస్తూ ప్లకార్డులు, బ్యానర్లతో గాంధీ భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
అందుకే ఇప్పుడు యూనిఫామ్ ఉద్యోగాలకు వయస్సును మరో నాలుగేళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ కు 36, ఎస్సై ఉద్యోగానికి 38 సంవత్సరాలు నిర్ణయించాలని కోరారు. గాంధీ భవన్ వద్ద నిరసన అనంతరం నిరుద్యోగులు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్ రావుకు వినతిపత్రం ఇచ్చి సర్కార్ దృష్టికి తీసుకురావాలని కోరారు.
