ప్రాజెక్టుల భూసేకరణకు రూ.5 వేల కోట్లు.. ఇప్పటికే రూ.2  వేల కోట్లు విడుదల చేసినం: మంత్రి ఉత్తమ్

ప్రాజెక్టుల భూసేకరణకు రూ.5 వేల కోట్లు.. ఇప్పటికే రూ.2  వేల కోట్లు విడుదల చేసినం: మంత్రి ఉత్తమ్

 

  • త్వరలోనే మిగతా రూ. 3 వేల కోట్లనూ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేస్తం
  • ఏఏ ప్రాజెక్టులకు ఎన్ని నిధులు కావాలో వెంటనే ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం
  • ప్రాజెక్టులపై మంత్రులు శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు, తుమ్మల, పొన్నం, అడ్లూరితో కలిసి రివ్యూ 

హైదరాబాద్​, వెలుగు: ప్రాజెక్టుల భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం కోసం రూ.5 వేల కోట్లు ఇచ్చేందుకు సీఎం రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారని, అందులో ఇప్పటికే రూ.2 వేల కోట్లు విడుదల చేశామని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. మరో రూ.3 వేల కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటికే పూర్తి కావొచ్చిన ఇరిగేషన్​ ప్రాజెక్టుల పనులకు నిధుల కొరత అడ్డంకి కాబోదన్నారు.

 శనివారం సెక్రటేరియెట్‌‌‌‌లో మంత్రులు శ్రీధర్​ బాబు, పొన్నం ప్రభాకర్​, తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌ రావు, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌తో కలిసి ప్రాజెక్టులపై ఉత్తమ్​ కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి రివ్యూ  చేశారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లోని ప్రాజెక్టులపై చర్చించారు. భూసేకరణ, పరిహారం చెల్లింపు, అటవీ అనుమతులు, పర్యావరణ అనుమతులను జిల్లాల కలెక్టర్లు ప్రాధాన్యంగా తీసుకోవాలని, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. ఎన్ని నిధులు కావాలో గుర్తించి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, అవసరమైన టోకెన్లను తీసుకోవాలని సూచించారు. పనులతోపాటే నిర్వాసితులకు పరిహారం చెల్లించాలన్నారు. ఇప్పటికే పనులు పూర్తి కావొచ్చిన పెద్ద ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు సాగునీటి అవసరాలను తీర్చేందుకు సీఎం రేవంత్​ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. మిడ్​మానేరు ఎడమ కాల్వలో మిగిలిపోయిన పనులను వెంటనే మొదలు పెట్టాలని సూచించారు. రివైజ్డ్​ ఎస్టిమేట్స్, భూసేకరణ, టెండర్లు, అనుమతుల పనులన్నీ చకచకా జరిగిపోవాలని ఆదేశించారు.   

ఈ నెలాఖరుకు పత్తిపాక రిజర్వాయర్​ డీపీఆర్​

పెద్దపల్లి జిల్లాలోని పత్తిపాక లక్ష్మీ నరసింహ స్వామి రిజర్వాయర్​ పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్​ఆదేశించారు. ఈ రిజర్వాయర్​ ద్వారా కాకతీయ మెయిన్​ కెనాల్​ కింద ధర్మపురి, చొప్పదండి, పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లోని 10 వేల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు 2.40 లక్షల ఎకరాలను స్థిరీకరించేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి రెండు ప్రత్యామ్నాయాలు పరిశీలనలో ఉన్నాయని, 3 టీఎంసీలు, 5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్​ నిర్మాణంపై లైడార్​ సర్వే పూర్తయిందని తెలిపారు. బోర్​హోల్, ట్రయల్​ పిట్స్, జియోటెక్నికల్​ ఇన్వెస్టిగేషన్స్​ జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆగస్టు చివరి నాటికి డీపీఆర్​ వస్తుందని తెలిపారు. జగిత్యాల జిల్లా బీర్పూర్​ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టు 96 శాతం పూర్తయిందని, ప్రాజెక్టు కెపాసిటీని 0.250 టీఎంసీల నుంచి 0.949 టీఎంసీలకు పెంచేలా కసరత్తులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చివరి ఆయకట్టు 15 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు వీలవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో అన్ని పనులూ పూర్తయ్యాయని, బండ్​ 2 అటవీ భూముల్లో నిర్మించాల్సి ఉండడంతో కేవలం అటవీ అనుమతులే పెండింగ్​ ఉన్నాయని చెప్పారు. భూసేకరణ చేయాల్సిన ప్రాజెక్టులు, పరిహారం చెల్లింపులు, అనుమతులు, వాటికయ్యే ఖర్చుతో సహా పూర్తి వివరాలను తయారు చేసి తర్వాతి మీటింగ్‌‌‌‌లో సమర్పించాలని అధికారులను మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఎన్సీ జనరల్​ రమేశ్ బాబు, జాయింట్​ సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు.  

అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా చూడాలి: శ్రీధర్​బాబు

నీటి పారుదల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణానికి భూ సేకరణ అడ్డంకిగా మారకుండా చూడాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని సూచించారు. భూసేకరణ ఆలస్యం అవడం, అటవీ భూముల బదలాయింపు విధానాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు. కొత్త రోడ్ల నిర్మాణం, దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇంజినీర్ల కొరత ఉందన్న ఫిర్యాదులు వస్తున్నాయని, డిప్యుటేషన్‌‌‌‌పై వాటిని సాధ్యమైనంత త్వరలో భర్తీ చేయాలని ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలమైన నివాస ప్రాంతాల ప్రజలకు మరొక చోట ఇండ్ల స్థలాలను కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాకాలంలో పారిశుధ్య కార్యక్రమాలు కుంటుపడితే అంటు వ్యాధులు ప్రబలుతాయని హెచ్చరించారు.