కేరళలో మరో వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం.. జై షా పరిశీలించిన స్థలంలోనే గ్రౌండ్!

కేరళలో మరో వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం.. జై షా పరిశీలించిన స్థలంలోనే గ్రౌండ్!

 
Cricket Stadium in Kerala: క్రికెట్ ప్రేమికులకు, క్రీడా రంగానికి కేరళ ప్రభుత్వం బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా మరో కొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర సర్కార్ అధికారికంగా పచ్చజెండా ఊపింది. ఎర్నాకులం జిల్లాలోని నెడుంబస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఉన్న ఆలువా తాలూకా, చెంగమనాడ్ గ్రామంలో 10.1312 హెక్టార్ల భూ మార్పిడికి (Land Conversion) వ్యవసాయ శాఖ జీవో (G.O NO. 61/2026/AGRI) జారీ చేసింది. 2008 కేరళ నెల్వయల్-తణ్ణీర్త్తడ (వరి పొలాలు, తడి నేలల) సంరక్షణ చట్టంలోని సెక్షన్ 10(2) నిబంధనల ప్రకారం ఈ భూమి కేటాయింపు జరిగింది. కేరళ స్పోర్ట్స్ పాలసీ 2023, కేరళ స్పోర్ట్స్ యాక్ట్ 2025, స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ స్కీమ్ 2025ల ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రజా ప్రయోజనం (Public Purpose) కింద గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ఏళ్ల నిరీక్షణకు తెర.. వేగంగా పర్మిషన్లు: 
కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) గతంలో సమర్పించిన దరఖాస్తు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, రెవెన్యూ మంత్రి కె. రాజన్, క్రీడా మంత్రి వి. అబ్దురహ్మాన్, వ్యవసాయ మంత్రి పి. ప్రసాద్‌లు అవసరమైన చట్టసవరణలు చేసి క్యాబినెట్‌లో దీనిని ఆమోదించారు. ఇప్పుడు కేరళ సీఎం వీడి సతీశన్ స్వయంగా జోక్యం చేసుకుని ఈ ప్రాజెక్టుని వేగవంతం చేయగా, వ్యవసాయ మంత్రి టి. సిద్ధిక్, మంత్రి ఓ.కె. జనీష్‌ల మార్గదర్శకాలతో కేసీఏకు భూసంస్కరణల చట్టం నుంచి కూడా ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు మంజూరు చేసింది.

ఐసిసి ఛైర్మన్ జై షా పర్యటన.. కేసిఏ హర్షం: 
కేరళలో మరో ప్రపంచ స్థాయి స్టేడియం రావడం పట్ల కేసీఏ ప్రెసిడెంట్ శ్రీజిత్ వి. నాయర్ ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడం వల్ల రాష్ట్రంలో స్పోర్ట్స్ టూరిజం పుంజుకోవడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నాడు. ఇక డబ్ల్యూపీఎల్ (WPL) ఛైర్మన్, కేసిఏ మాజీ ప్రెసిడెంట్ జయేష్ జార్జ్ మాట్లాడుతూ.. గతంలో కేరళలో జరిగిన ఐపిఎల్ వేలం సందర్భంగా ఐసీసీ (ICC) ఛైర్మన్ జై షా కూడా ఈ స్థలాన్ని స్వయంగా సందర్శించి ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లేందుకు కీలక సూచనలు ఇచ్చారని గుర్తు చేశారు. త్వరలోనే బీసీసీఐ ప్రతినిధులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిటీ ఈ ప్రదేశాన్ని సందర్శించనున్నాయి. పర్యావరణ నిబంధనలను పాటిస్తూ, సుస్థిరమైన (Sustainable) మోడల్‌లో ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దుతామని కేసీఏ సెక్రటరీ వినోద్ ఎస్. కుమార్ స్పష్టం చేశారు.

కొత్త స్టేడియం విశేషాలు: 
* ప్రదేశం– చెంగమనాడ్ గ్రామం, ఆలువా తాలూకా (ఎర్నాకులం)
* ప్రత్యేకత– నెడుంబస్సేరి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర్లోనే నిర్మాణం
* మొత్తం స్థలం– 10.1312 హెక్టార్లు
* సౌకర్యాలు– అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు మల్టీ-స్పోర్ట్స్ సదుపాయాలు