నిషిన్ (జపాన్): ఆసియా క్రీడల్లో ఇండియా విమెన్స్ జట్టు వరుసగా రెండోసారి స్వర్ణ పతకంతో మెరిసింది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (45 బాల్స్‌లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 79), రిచా ఘోష్ (22 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 నాటౌట్), షెఫాలీ వర్మ (29 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) చెలరేగడంతో.. మంగళవారం జరిగిన ఫైనల్లో టీమిండియా 147 రన్స్ భారీ తేడాతో శ్రీలంకపై గెలిచింది. ప్రస్తుత క్రీడల్లో ఇండియాకు లభించిన తొలి స్వర్ణం ఇదే కావడం విశేషం. టాస్ గెలిచిన ఇండియా 20 ఓవర్లలో 216/3 స్కోరు చేసింది. ఏషియాడ్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. లక్ష్య ఛేదనలో లంక 15.4 ఓవర్లలో 69 రన్స్‌కే కుప్పకూలింది. కెప్టెన్ చామరి ఆటపట్టు (29) టాప్ స్కోరర్.
ఓపెనర్లు అదుర్స్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ఓపెనర్లు స్మృతి, షెఫాలీని కట్టడి చేయడంలో లంక బౌలర్లు ఫెయిలయ్యారు. దాంతో పవర్‌ప్లేను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ ఇద్దరు పరుగుల వరద పారించారు. మూడో ఓవర్‌లో మంధాన.. లంక లెఫ్టార్మ్ స్పిన్నర్ సుగంధిక కుమారి (1/37) బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టింది. ఒకటి బ్యాక్‌ఫుట్‌పై, రెండోది స్లాగ్ స్వీప్‌తో బౌండ్రీ లైన్‌ను దాటించింది. ఆ వెంటనే మిథాలీ అయోధ్య వేసిన తర్వాతి ఓవర్‌లో ఎక్స్‌ట్రా కవర్స్ మీదుగా మరో సిక్స్ బాదింది.
ఐదో ఓవర్‌లో ఆటపట్టు మూడు సిక్స్‌లతో కలిపి 19 రన్స్ ఇచ్చుకుంది. ఇందులో షెఫాలీ లాంగాఫ్, మిడాఫ్ మీదుగా రెండు సిక్సర్లు కొట్టగా, మంధాన లాంగాన్‌లో సిక్స్ కొట్టింది. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి 59/0 స్కోరు సాధించారు. సాఫీగా సాగుతున్న ఈ జోడీని 10వ ఓవర్‌లో ప్రబోధ (1/34) విడగొట్టింది. టర్నింగ్ బాల్‌ను రివర్స్ స్వీప్ ఆడబోయిన షెఫాలీ.. కావిండికి క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌కు 99 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
30 బాల్స్‌లో మంధాన హాఫ్ సెంచరీ చేయగా.. వన్‌డౌన్‌లో వచ్చిన హర్మన్‌ప్రీత్ (19) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. 15వ ఓవర్‌లో లాంగాఫ్ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. రెండో వికెట్‌కు 40 రన్స్ జతయ్యాయి. నిలకడగా ఆడుతున్న మంధాన.. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో స్లాగ్ స్వీప్ ఆడే ప్రయత్నంలో డీప్ రీజియన్‌లో క్యాచ్ ఇచ్చి ఔటైంది. చివర్లో భారతి ఫుల్మాలి (7 నాటౌట్)తో కలిసి రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఇండియా స్కోరు ఈజీగా 200లు దాటింది.
బౌలర్లు సూపర్..
భారీ లక్ష్య ఛేదనలో లంకను ఇండియా బౌలర్లు వణికించారు. ముఖ్యంగా స్పిన్నర్లు దీప్తి శర్మ (3/6), శ్రీచరణి (2/13), శ్రేయాంక పాటిల్ (2/9)తో పాటు పార్ట్ టైమర్ షెఫాలీ వర్మ (2/3) వరుస విరామాల్లో వికెట్లు తీశారు. ఫలితంగా లంక ఇన్నింగ్స్‌లో ఆటపట్టు, కావిషా దిల్హారి (11), కౌశిని నుతయాంగన (14) మినహా మిగతా వారందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. ఇందులో నలుగురు సున్నాకే పరిమితమయ్యారు. మరోవైపు బంగ్లాదేశ్‌పై 31 రన్స్ తేడాతో గెలిచిన పాకిస్తాన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 216/3 (స్మృతి 79, రిచా 49*, షెఫాలీ 48, ప్రబోధ 1/34).
శ్రీలంక: 15.4 ఓవర్లలో 69 ఆలౌట్ (చామరి 29, దీప్తి శర్మ 3/6, శ్రేయాంక 2/9).
