- తండాలు, మారుమూల పల్లెలకు మినీ బస్సులు నడిపే యోచన
- మరో నెలలో రానున్న సర్వే రిపోర్టు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు రాని పల్లె ఉండొద్దనే లక్ష్యంతో ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. వంద శాతం గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించి సరికొత్త రికార్డు నెలకొల్పేందుకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తోంది. మూడు నెలలుగా కొనసాగుతున్న ఈ సర్వే మరో నెల రోజుల్లో పూర్తికానుంది. నివేదిక ఆధారంగా బస్సు సౌకర్యం లేని గ్రామాలకు కొత్త రూట్లను ఏర్పాటు చేయనున్నారు.
ముఖ్యంగా మారుమూల పల్లెలు, అటవీ ప్రాంతాల్లోని తండాలకు మినీ బస్సులు నడపడంపై యాజమాన్యం దృష్టి పెట్టింది. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే ప్రాంతాల్లో సాధారణ బస్సులతో పోలిస్తే మినీ బస్సుల నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇరుకు రోడ్లపై సైతం వీటిని సులభంగా నడిపే అవకాశం ఉండటంతో వందల సంఖ్యలో మాత్రమే జనాభా ఉన్న పల్లెలకూ రవాణా సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నారు. గతంలో హైదరాబాద్ ఓల్డ్‌సిటీలోని ఇరుకు రోడ్లపై నడిపిన మినీ బస్సులను ఈ ప్రాంతాల్లో వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
రూట్ల నుంచి ట్రిప్పుల దాకా అధ్యయనం
బస్సులు వెళ్లని గ్రామాలు ఎన్ని? ఆయా గ్రామాలకు ఏ రూట్లలో బస్సులు నడపాలి? రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోజుకు ఎన్ని ట్రిప్పులు అవసరం? ఏ సమయాల్లో ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది? బస్సుల నిర్వహణకు ఎంత ఖర్చవుతుంది? ఆదాయం ఎంత వచ్చే అవకాశం ఉంది? తదితర అంశాలను సర్వేలో పరిశీలిస్తున్నారు. ఆదాయం పెద్దగా లేకున్నా కనీస నిర్వహణ ఖర్చులు వచ్చేలా రూట్లను రూపొందించడంపై దృష్టి పెట్టారు.
ఆదాయం కంటే ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించడానికే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ ముందుకెళ్తోంది. సర్వే నివేదిక వచ్చిన తర్వాత కార్యాచరణ రూపొందించి, రాష్ట్రంలోని ప్రతి పల్లెకూ ‘ఎర్ర బస్సు’ను చేరవేయాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది.
