PVR INOX సినిమా థియేటర్‌లో మహిళకు చేదు అనుభవం !

PVR INOX సినిమా థియేటర్‌లో మహిళకు చేదు అనుభవం !

మల్లీప్లెక్స్ థియేటర్లలోకి కొన్ని తీసుకెళ్లడం నిషేధం. అయితే.. అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్లకు కొన్ని వస్తువుల విషయంలో మినహాయింపు ఇవ్వకపోవడంపై కొన్ని సందర్భాల్లో మల్టీప్లెక్స్ యాజమాన్యాలపై విమర్శలు వ్యక్తమైన ఘటనలు గతంలో చూశాం. రైతు వస్త్రధారణ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక మాల్లోకి అనుమతించకపోతే అప్పట్లో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఘటనలో ఏమైందంటే.. ఆమెకు టైప్-1 డయాబెటిస్ ఉంది.

ఆమె నోయిడాలోని PVR INOX సినిమా థియేటర్‌లో సినిమా టికెట్ బుక్ చేసుకుని మూవీకి వెళ్లింది. అయితే.. ఆమెను థియేటర్ మేనేజర్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కారణం.. ఆమె దగ్గర టైప్ 1 డయాబెటిస్‌ ఎమర్జెన్సీ కిట్‌ ఉండటమే. ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉంటే సినిమాకు రాకూడదని.. సినిమాకు వచ్చి వెళ్లనీయడం లేదని నానా యాగీ చేయడం ఏంటని ఆ మహిళతో థియేటర్ మేనేజర్ వాదించాడు. ఈ ఘటనను సదరు మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

►ALSO READ | రష్యా నుంచి ఇండియాకు రైలు.. వయా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్!

జ్యోత్స్న రంగీన్ అనే ఈ మహిళ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ‘X’ వివరించింది. ఆ కిట్ వైద్యపరంగా అవసరమని తాను వివరించినప్పటికీ, భద్రతా సిబ్బంది ఆ కిట్‌ను వెంట ఉంచుకోవడంపై అభ్యంతరం తెలిపారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్య ఉంటే, సినిమా చూడటానికి రాకూడదని మేనేజర్ అన్నారని.. ఇది వివక్షనేనని ఆమె చెప్పింది. ఆమె తీసుకువెళ్తున్న అత్యవసర కిట్‌ను.. రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయే హైపోగ్లైసీమియా సమయంలో ఉపయోగిస్తారు. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారికి, ఆహారం, గ్లూకోజ్ లేదా ఇతర అత్యవసర సామాగ్రి అందుబాటులో ఉండటం వైద్యపరంగా చాలా ముఖ్యం.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో PVR యాజమాన్యం ఈ ఘటనపై స్పందించింది. ఆమెకు క్షమాపణ చెప్పింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. వైద్యపరంగా అవసరమైన ఆహారం, పానీయాలు, డయాబెటిస్ కిట్‌లను తమ సినిమా హాళ్లలోకి అనుమతిస్తామని PVR INOX తర్వాత స్పష్టం చేసింది. తమ సెక్యూరిటీ సిబ్బంది మొదట ఆ వస్తువులను బయటి ఆహారంగా పొరపాటుగా పడ్డారని, ఆ తర్వాత మెడికల్ కిట్ అని తెలిసి.. పరిస్థితి గురించి డ్యూటీ మేనేజర్‌కు తెలియజేసి తర్వాత ఆ వస్తువులను అనుమతించినట్లు కంపెనీ తెలిపింది.