గుజరాత్లో షాకింగ్ ఘటన జరిగింది. ఆమె వయసు 45 ఏళ్లు. ఆ కుర్రాడి వయసు 25 సంవత్సరాలు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం సదరు మహిళ ప్రాణం తీసింది. పెళ్లి చేసుకోవాలని యువకుడిని ఆమె పదేపదే ఒత్తిడి చేయడంతో రైలు పట్టాల మీదకు తోసేసి ఆమెకు చంపేశాడు. తీవ్ర గాయాల పాలైన ఆమె చనిపోయింది. రైలు ప్రమాదంలో ప్రమాదవశాత్తూ చనిపోయిందని తొలుత భావించినప్పటికీ పోలీసుల దర్యాప్తులో హత్యగా తేలింది. గుజరాత్‌లోని గోండాల్‌లో రైల్వే ట్రాక్ సమీపంలో 45 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైన ఘటనలో ఈ వాస్తవం వెలుగుచూసింది.
ఆగస్టు 4న రాజ్‌కోట్‌లోని రైల్వే ట్రాక్‌ల సమీపంలో మహిళ మృతదేహం లభ్యం కావడంతో వెలుగులోకి వచ్చింది. అయితే.. ఆమె శరీరంపై అప్పటికే గాయాలు కనిపించాయి. అక్కడే రైల్వే పోలీసులకు అనుమానం బలపడింది. ఈ దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చేసరికి ఆ మహిళను పట్టాల పైకి తోసేశారని వెల్లడైంది. నిందితుడు ప్రకాష్ సోలంకిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. శవం దొరికిన ప్రదేశానికి అతనిని తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు రాజ్‌కోట్ సివిల్ ఆసుపత్రికి పంపారు. గోండల్ రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు.
►ALSO READ | మేఘాలయ హనీమూన్ బాధితుడు రాజా రఘువంశీ బ్రదర్స్ ఎంత పనిచేశారంటే..
ఆగస్ట్ 3వ తేదీ రాత్రి సుమారు 11.30 గంటలకు ఆ మహిళ ప్రకాష్‌తో కలిసి రైల్వే స్టేషన్‌కు రావడం ఆ ఫుటేజీలో కనిపించింది. ఆ తర్వాత ఇద్దరూ రైల్వే ట్రాక్‌ల వైపు నడుచుకుంటూ వెళ్లి అక్కడ కూర్చున్నారు. సుమారు రెండు గంటల తర్వాత.. రైలు వస్తున్న సమయంలో ప్రకాష్ ఆ మహిళను పట్టాల నుంచి పక్కకు జరగమని చెప్పాడు. రైలు మరింత దగ్గరకు రాగానే, ఉన్నట్టుండి ఆమెను పట్టాలపైకి తోసేశాడు. ఆమె రైలు కింద పడిపోయింది. ఆ మహిళ ప్రకాష్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే.. ప్రకాష్ కుటుంబం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. అతని కుటుంబం భర్త నుంచి విడిపోయిన 45 ఏళ్ల మహిళను తమ కోడలిగా అంగీకరించడానికి ముందుకు రాలేదు. ప్రకాష్ ఆమెను పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పేశాడు.
అయినప్పటికీ ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో తెలివిగా ఆమెను రైలు పట్టాల మీదకు తోసేసి చంపేసి.. ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు. కానీ.. హత్య కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లాడు. చనిపోయిన ఈ మహిళకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురికి, చిన్న కూతురికి పెళ్లిళ్లు అయిపోయాయి. భర్త నుంచి విడిగా ఉంటూ ఈ మహిళ గోండల్‌లో ఒంటరిగా ఉంటూ.. హోటళ్లు, క్యాటరింగ్ సంస్థలలో వంటమనిషిగా పనిచేస్తూ జీవనం సాగించేది. ఈ క్రమంలోనే ప్రకాష్తో పరిచయమైంది. చివరికి ఇలా ప్రకాష్ చేతిలోనే హత్యకు గురై చనిపోయింది.
