జనగామ అర్బన్, వెలుగు : జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం, సమీక్షా సమావేశం శనివారం జనగామలో నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, వైటీడీఏ బోర్డు మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ చీఫ్గెస్ట్లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ, పట్టణ, మండల నూతన కార్యవర్గాలు ప్రమాణ స్వీకారం చేశాయి.
అనంతరం జరిగిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ వ్యక్తిగత విభేదాలు, అంతర్గత కలహాలకు తావులేకుండా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను బూత్ స్థాయి నుంచి ప్రతి ఇంటికీ చేరవేయాలని సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.
