- ట్రాక్టర్ పై, కాలినడకన వెళ్లి వైద్య సేవలందించిన డాక్టర్ శ్రీకాంత్
వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ పీహెచ్సీ పరిధిలోని గొత్తికోయ గ్రామాలైన తొర్రి చింతలపాడు, రోలుబండ గూడేల్లో డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 6 కిలోమీటర్లు ట్రాక్టర్, నడుచుకుంటూ వెళ్లి గిరిజనులకు వైద్యం అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తొర్రిచింతలపాడులో 37 మందికి, రోలుబండలో 49 మందికి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించామని తెలిపారు. గర్భిణులను పరీక్షించి డెలివరీ తేదీలకు అనుగుణంగా హాస్పిటల్కు తీసుకొచ్చేలా అవగాహన కల్పించామని చెప్పారు.
30 ఏండ్లు పైబడిన వారందరికీ బీపీ, డయాబెటిస్ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపారు. ఐదేండ్ల లోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేశామని చెప్పారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా పోర్టేబుల్ చెస్ట్ ఎక్స్ రే మెషీన్ ద్వారా 16 మందికి క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహించి, నలుగురు అనుమానితులను గుర్తించామని తెలిపారు. అనారోగ్య సమస్య ఉంటే వెంటనే హాస్పిటల్కు తీసుకురావాలని కోరారు. ఎంఎల్ హెచ్ పీ నవీన్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
