తొర్రూరు, వెలుగు: డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆదేశించారు. గురువారం తొర్రూరు పట్టణం గోపాలగిరి ప్రాంతంలోని 280 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తుందని తెలిపారు. త్వరలోనే అర్హులైన వారందరికీ ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. పైప్ లైన్, విద్యుత్, డ్రైనేజీ సిస్టం వంటి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, దశలవారీగా ఉన్న పనుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి డబ్బులు వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. అనంతరం మండలంలోని వెలికట్టె గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని, టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. హౌసింగ్ పీడీ పురుషోత్తం, అధికారులు ఉన్నారు.
