విజయ్ కార్లకు ఒకే నంబర్.. ‘0277’ వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఇదే..

విజయ్ కార్లకు ఒకే నంబర్.. ‘0277’ వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఇదే..

ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశంతో సంచలనం సృష్టిస్తున్న విజయ్.. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన నంబర్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సాధారణంగా స్టార్ హీరోలంటే తమ లగ్జరీ కార్లకు ఫ్యాన్సీ నంబర్లు ఉండాలని కోరుకుంటారు. కానీ విజయ్ తన కాన్వాయ్‌లోని కార్లన్నింటికీ.. చివరికి తన ప్రచార వాహనానికి కూడా ఒకే రకమైన నంబర్ ప్లేట్ ఉండేలా చూసుకోవడం వెనుక ఒక స్టోరీ దాగి ఉంది. అదే "0277". ఈ నంబర్ ఇప్పుడు తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో ఒక ఎమోషనల్ సెంటిమెంట్‌గా మారిపోయింది.

విజయ్ తన కొత్త రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ పనుల్లో బిజీగా ఉంటూనే.. తన వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో చూపించిన ప్రత్యేకత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన వాడుతున్న బీఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ కార్, లెక్సస్ ఎల్‌ఎమ్, టయోటా వెల్‌ఫైర్ వంటి విలాసవంతమైన కార్లతో పాటు.. ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేసిన బస్సుకు కూడా చివరన ‘0277’ అనే నంబరే కనిపిస్తోంది. మొదట్లో ఇది కేవలం విజయ్ ఇష్టపడే ఒక ఫ్యాన్సీ నంబర్ అని అందరూ భావించారు. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిశాక ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

►ALSO READ | ప్రభుత్వ ఏర్పాటుకు మీకు మెజారిటీ లేదు: విజయ్కు తేల్చి చెప్పిన తమిళనాడు గవర్నర్

విజయ్ సోదరి విద్య చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. తన చెల్లెలు అంటే విజయ్‌కు ప్రాణం. ఆమె పుట్టిన తేదీ ఫిబ్రవరి 14, 1977. తన సోదరి జ్ఞాపకార్థం ఆమె పుట్టిన నెలలోని ‘02’ను, పుట్టిన ఏడాదిలోని ‘77’ను కలిపి విజయ్ తన వాహనాలకు ‘0277’ అనే నంబర్‌ను ఎంచుకున్నారు. ప్రతి ప్రయాణంలోనూ.. తన ఎదుగుదలలోనూ సోదరి తోడుండాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ భావోద్వేగ అనుబంధం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అభిమానులు #TN140277 వంటి హ్యాష్ ట్యాగ్‌లతో పోస్టులు పెడుతూ తమ హీరో వ్యక్తిత్వాన్ని కొనియాడుతున్నారు.

సినిమాల నుంచి రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో.. విజయ్ ఈ నంబర్‌ను తన లక్కీ చార్మ్ గా కూడా భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తమిళ రాజకీయాల్లో సీఎం స్థాయికి చేరుకున్న విజయ్ ఇచ్చిన ఈ ఎమోషనల్ టచ్ ప్రజలకు మరింత దగ్గర చేస్తోంది. ఒకే రకమైన నంబర్ ప్లేట్లు వాడటంపై కొన్ని చట్టపరమైన చర్చలు సాగుతున్నప్పటికీ, నెటిజన్లు మాత్రం ఆ లాజిక్కుల కంటే అన్న-చెల్లెళ్ల సెంటిమెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తన సక్సెస్ వెనుక కుటుంబ విలువలని, సోదరిపై ఉన్న అంతులేని ప్రేమను చాటిచెప్తూ విజయ్ మరోసారి దళపతి అనిపించుకుంటున్నారు. ఈ ఎమోషనల్ స్టోరీ ఇప్పుడు తమిళనాడు అంతటా మారుమోగిపోతోంది.