ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుచ్చ కాయ ఫుడ్ పాయిజన్ కేసులో కీలక నిజం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోలేదని వెల్లడైంది. విషప్రయోగం వల్ల మరణించారని ఫోరెన్సిక్ పరీక్ష నిర్ధారించింది.
బాధితుల శరీరాల్లో, వారు తిన్న పుచ్చ కాయలో ఎలుకలను చంపడానికి ఉపయోగించే జింక్ ఫాస్ఫైట్ (Zinc Phosphide) అనే ఒక విష పదార్థం ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. ఈ నలుగురి మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసిన క్రమంలో.. వారి అంతర్గత అవయవాలలో ఆకుపచ్చ రంగు కనిపించడంతో విష ప్రయోగం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫోరెన్సిక్ పరీక్షలో వాళ్లు తిన్న పుచ్చకాయలో ఎలుకల మందు కలిసిందని తేలింది.
అసలేం జరిగిందంటే..
ముంబైలోని పైధోని ప్రాంతంలో ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. మటన్ బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోయారని తొలుత భావించారు. చనిపోయిన నలుగురిని.. అబ్దుల్లా డోకాడియా (40), నస్రీన్ డోకాడియా (35), వారి కుమార్తెలు ఆయిషా (16), జైనాబ్ (13)గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 25న రాత్రి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి బిర్యానీ తిన్నారు. అనంతరం అర్ధరాత్రి నలుగురు కలిసి పుచ్చకాయ తిన్నారు.
►ALSO READ | సోనా కామ్స్టర్: సంజయ్ కపూర్ రూ.30 వేల కోట్ల ఆస్తుల వివాదం కేసు.. మధ్యవర్తిగా మాజీ సీజేఐ
దీంతో తెల్లవారుజామున వారికి వికారం, వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో వెంటనే జేజే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్న కుమార్తె జైనాబ్ మరుసటి రోజు ఉదయం మరణించగా అదేరోజు రాత్రి తండ్రి అబ్దుల్లా ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత తల్లి, పెద్ద కుమార్తె చికిత్సకు స్పందించక మరణించారు.
