పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాలను అభినందిస్తాం.. ఆదరిస్తాం.. కానీ రాజకీయాలు వద్దని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ రంగులు వేసుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఎవరో ఆడిస్తే పవన్ ఆడుతున్నారు అంటూ ఫైరయ్యారు.
సోమవారం (జూన్ 22) హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సాయంత్రం TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఏపీ ఉపముఖ్యమంత్రిగా అక్కడ మీ సేవలు చేయండి.. మాకు ఇతర రాష్ట్ర నేతల సలహాలు, సూచనలు అవసరం లేదు.. ఇక్కడ మేం సమర్థవంతంగా రాష్ట్రాన్ని అభివ్రుద్ది చేసుకుంటున్నాం.. అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రామ్ చందర్ రావు రాహుల్ గాంధీకి లేఖ రాస్తున్నారు. దానికి ముందు మీరు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి.. మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిత్యవసర ధరలు ఎందుకు ఇంత పెరిగాయి..? 12 ఏళ్లలో ఏ సామాన్యుడు బాగుపడ్డాడా..? రోడ్డున పడ్డాడా.. అంటూ ఫైరయ్యారు.
కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చింది.. తన అన్నకు ఎందుకు దూరమైంది.. దోసుకున్న సొమ్ములో వాటాల పంపకాలే కారణం కాదా అన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన ఆర్ధిక విధ్వంసం.. రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివ్రుద్దిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో BRS పని అయిపొయింది.. తెలంగాణ రాష్ట్రంలో BRS నూకలు చెల్లిపోయాయి అంటూ ఎద్దేవా చేశారు.
