ఉదయం ఆఫీస్‌కు వెళ్లేందుకు ర్యాపిడోలో బుక్ చేసుకున్న ఓ సాధారణ బైక్ ట్యాక్సీ రైడ్.. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ సాని కృష్ణ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. కేరళకు చెందిన 32 ఏళ్ల సాని.. ర్యాపిడో బైక్ ట్యాక్సీ ప్రమాదంలో ట్రాక్టర్ కింద పడి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కోలుకునేందుకు పోరాడుతున్నారు. ప్రమాదం తర్వాత కంపెనీ నుంచి తగిన సహాయం అందలేదని ఆరోపిస్తూ ఆమె వినియోగదారుల కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైంది.
ఈ ఏడాది జూన్ 17న సాని కృష్ణ బెంగళూరులోని బైరసంద్ర నుంచి డొమ్లూర్‌లోని తన కార్యాలయానికి వెళ్లేందుకు ర్యాపిడో బైక్ ట్యాక్సీ బుక్ చేసుకున్నారు. బగ్మానే టెక్ పార్క్ సమీపంలో ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే.. అంటే కిలోమీటర్ లోపే ప్రమాదం జరిగిందని ఆమె చెబుతున్నారు. బైక్ రైడర్ ఓ ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పిందని ఆమె వెల్లడించారు. దీంతో బైక్‌పై ఉన్న సాని రోడ్డుపై పడిపోగా, అదే సమయంలో ట్రాక్టర్ ఆమెపై నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదం ఆమె జీవితంలో ఊహించని విషాదాన్ని మిగిల్చింది.
ప్రమాదం తర్వాత సానిని తొలుత సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. తీవ్ర గాయాల కారణంగా ఆమెకు పలు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. తర్వాత మెరుగైన చికిత్స, పునరావాసం కోసం కేరళలోని మిత్రాస్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో సాని శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసరంగా ఆమె స్ప్లీన్ తొలగించాల్సి వచ్చింది. లివర్ కి తీవ్ర నష్టం వాటిల్లింది. 9 పక్కటెముకలు విరగడంతో పాటు ఊపిరితిత్తి దెబ్బతింది. భుజం విరగడం, ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రామాతో మానసిక ఒత్తిడి సమస్యతో కూడా ఆమె చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే తన వైద్య ఖర్చులు రూ.20 లక్షలు దాటాయని సాని చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ప్రకారం మొత్తం ఖర్చు రూ.25 లక్షలకు పైగా చేరుకుంది. అయితే ర్యాపిడో నుంచి నేరుగా ఆర్థిక సహాయం, పరిహారం గానీ అందలేదని ఆమె ఫ్యామిలీ ఆరోపిస్తోంది.
ALSO READ : స్కూల్ ఫీజులపై కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం
సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో సాని ర్యాపిడో సేఫ్టీ హామీలపై ప్రశ్నలు లేవనెత్తారు. మహిళల భద్రతపై పెద్ద ఎత్తున ప్రచారం చేసే సంస్థ.. ప్రమాదం జరిగిన తర్వాత తనకు అండగా నిలబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై ర్యాపిడో స్పందిస్తూ.. తాము సాని కుటుంబంతో సంప్రదింపుల్లో ఉన్నామని, అవసరమైన సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. అయితే తనకు కేవలం ఇన్సూరెన్స్ ప్రక్రియ వైపే చూపించారని, ప్రత్యక్ష సహాయం అందలేదని సాని చెబుతున్నారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రైడ్ సేవలు అందించే సంస్థలు కేవలం ప్రయాణ సమయంలోనే కాకుండా ప్రమాదాల తర్వాత కూడా జర్నీ చేస్తున్న వారి సేఫ్టీ, సహాయంపై బాధ్యత తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒక చిన్న ప్రయాణం ఎలా ఓ కుటుంబ జీవితాన్ని మార్చేసిందో సాని కృష్ణ ఘటన కళ్లకు కడుతోంది.
