విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ..! వైసీపీ నేతలను ఇంటికొచ్చి కొడతామంటూ... రెచ్చిపోయిన బోండా ఉమా..!

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ..! వైసీపీ నేతలను ఇంటికొచ్చి కొడతామంటూ... రెచ్చిపోయిన బోండా ఉమా..!

ఏపీలో డీఎస్సీ 2025 అంశంపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కి చేరింది. డీఎస్సీ 2025 నియామకాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టింది వైసీపీ. ఈ క్రమంలో విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ పీక్స్ కి చేరింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి చేరుకొని హల్చల్ చేశారు ఎమ్మెల్యే బోండా ఉమా. అబద్దాలు ప్రచారం చేస్తే ఇంటికొచ్చి కొడతామంటూ రెచ్చిపోయారు బోండా ఉమా.

అనుమతి లేకుండా వైసీపీ నేతలు దీక్షా శిబిరం ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు బోండా ఉమా. మంత్రి నారా లోకేష్‌ను ఇష్టారీతిన దుర్భాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు దీక్షా శిబిరం టెంట్ తొలగిస్తుండగా... వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్రం అవ్వడంతో భారీగా మోహరించారు పోలీసులు.

ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు మల్లాది విష్ణును అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా ధర్నా చేస్తున్నారని విష్ణును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

డీఎస్సీపై వైసీపీ  అనవసర రాద్దాంతం చేస్తుందని.. 18 వేల మంది పరీక్ష రాసి ఉద్యోగం సంపాదిస్తే వారి జీవితాలను జగన్  నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే చర్చకు రావాలని లోకేష్  సవాల్  విసిరారని.. దాని పై చర్చించే  దమ్ము, ధైర్యం జగన్ కు, వైసిపి నాయకులకు లేదని అన్నారు.

గవర్నమెంట్ ప్రెస్ దగ్గర ఆందోళనకు పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు బోండా ఉమా. ధర్నా చౌక్ లో చేసుకుంటే మేము వచ్చే వాళ్లం కాదని.. గంటన్నర వేచి చూసినా శిబిరం తొలగించలేదని..అందుకే నేను వచ్చి ఇక్కడ నిరసన తెలిపానని అన్నారు. లోకేష్ ను నోటికొచ్చినట్లు తిడితే మేము చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. నోరు అదుపులో ఉంచుకోకుంటే వారి ఇళ్లకు వెళ్లి ఈసారి బుద్ది చెబుతామని అన్నారు బోండా ఉమా.