షాకింగ్ న్యూస్.. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ కనుమరుగు !

షాకింగ్ న్యూస్.. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ కనుమరుగు !

ఆండ్రాయిడ్‌ స్మార్ట్ ఫోన్లలో దాదాపు పదేళ్ల పాటు ఏలిన గూగుల్ అసిస్టెంట్ కనుమరుగు కానుంది. గూగుల్ అసిస్టెంట్‌కు యాక్సెస్‌ను సెప్టెంబర్ 4, 2026 నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. గూగుల్ అసిస్టెంట్ స్థానంలో జెమిని రంగప్రవేశం చేయనుంది. వాస్తవానికి జెమిని అందుబాటులోకి వచ్చినప్పటి నుంచే గూగుల్ అసిస్టెంట్కు రోజులు దగ్గరబడ్డాయి.

సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌లు, టాబ్లెట్‌లతో పాటు, స్మార్ట్‌వాచ్‌లు లేదా హెడ్‌ఫోన్‌ల వంటి జత చేసిన పరికరాలలో కూడా గూగుల్ అసిస్టెంట్‌కు యాక్సెస్‌ను తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అయితే.. గూగుల్ అసిస్టెంట్‌తో కూడిన కార్లలో మాత్రం సెప్టెంబర్ 4 తర్వాత కూడా గూగుల్ అసిస్టెంట్ కొనసాగుతుంది.  గూగుల్ హోమ్ స్పీకర్‌లు, స్మార్ట్ డిస్‌ప్లేలు, గూగుల్ టీవీ పరికరాలలో కూడా గూగుల్ అసిస్టెంట్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

గూగుల్ అసిస్టెంట్ కంటే మెరుగ్గా ఇప్పుడు చాలా అందుబాటులోకి వచ్చాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని ప్రతి ఒక్కరూ పరోక్షంగా లేదంటే ప్రత్యక్షంగా రోజూ వాడుతూనే ఉన్నారు. అందుకే గూగుల్, మెటా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు పోటీపడి మరి ఏఐలో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వాటి ద్వారా యూజర్లకు మరింత మెరుగైన అనుభవం అందించడానికి ప్రయత్నిస్తున్నాయి.ఈ క్రమంలోనే గూగుల్ జెమిని లైవ్ 'రియల్ టైం ఏఐ' ఫీచర్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

జెమిని లైవ్ అనేది గూగుల్ జెమిని అప్లికేషన్లోని ఒక ప్రత్యేకమైన ఇంటరాక్టివ్ ఫీచర్. మీరు చూస్తున్న వస్తువుని ఫోన్ కెమెరా ద్వారా చూపించి.. దాని గురించి నేరుగా జెమినితో మాట్లాడొచ్చు. అది మీకు కావాల్సిన ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా వెంటనే చెప్పేస్తుంది. ఇది తెలుగు సహా అనేక భారతీయ భాషలను అర్థం చేసుకోగలదు. ప్రశ్న అడిగిన భాషలోనే సమాధానాలు కూడా ఇస్తోంది. ఇది వాయిస్ను మాత్రమే కాదు.. వీడియోలు, pdf, ఫొటోలు, టెక్స్ట్... ఇలా అన్నింటినీ అర్థం చేసుకోగలదు.