ముంబైకి చెందిన ఓ టెక్కీ అప్పుల ఊబిలో చిక్కుకుని.. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సోషల్ మీడియాలో సలహాలు సూచనలు కోరటం ప్రస్తుతం వైరల్‌గా మారింది. కరోనా సమయంలో సరదాగా ప్రారంభించిన F&O ఆప్షన్స్ ట్రేడింగ్ చివరకు అతడిని రూ.60 లక్షల అప్పుల భారంలోకి నెట్టింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఏం చేయాలో తెలియక రెడిట్‌లో తన ఆర్థిక పరిస్థితిని పంచుకోవడంతో వేలాది మంది స్పందించి సూచనలు చేశారు.
రెడిట్‌లో gaushi1614 పేరుతో పోస్ట్ చేసిన ఈ వ్యక్తి.. తాను ముంబైలోని ప్రముఖ ఐటీ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపాడు. కోవిడ్ సమయంలో స్టాక్ మార్కెట్, F&O ట్రేడింగ్‌పై ఆసక్తి పెరిగిందని.. మొదట సరదాగా మొదలైన ట్రేడింగ్ క్రమంగా వ్యసనంగా మారిందని చెప్పాడు. నష్టాలను తిరిగి రాబట్టాలనే ప్రయత్నంలో మరింత ట్రేడింగ్ చేయడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పి దాదాపు రూ.80 లక్షలు నష్టపోయానని వెల్లడించాడు.
ప్రస్తుతం తనపై పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డు బిల్స్, ఎన్‌బీఎఫ్‌సీలు, లోన్ యాప్‌లకు కలిపి సుమారు రూ.60 లక్షల అప్పు ఉందని లెక్కలు చెప్పాడు. నెలకు రూ.లక్షా 60వేలు జీతం వస్తున్నప్పటికీ.. ఈఎంఐలకే దాదాపు రూ.లక్షా 85వేలు చెల్లించాల్సి వస్తోందని తెలిపాడు. కుటుంబ ఖర్చులను నిర్వహించాలంటే నెలవారీ ఈఎంఐ భారాన్ని రూ.లక్షా 30వేలకు తగ్గించే మార్గం సూచించాలని నెటిజన్లను కోరాడు. కొత్త అప్పులు, లోన్ కన్సాలిడేషన్ కోసం ప్రయత్నించినా లాభం లేకపోయిందని, అయితే ఇప్పటివరకు ఒక్క ఈఎంఐ కూడా డిఫాల్ట్ కాలేదని చెప్పాడు. తన భార్య, పిల్లలకు ఈ అప్పుల విషయం పూర్తిగా తెలియదని, రికవరీ ఏజెంట్లు ఇంటికి వస్తారేమోనన్న భయం వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ALSO READ : పిచ్చెక్కిస్తున్న గోల్డ్ ర్యాలీ.. హైదరాబాదులో రూ.2వేల 900 పెరిగిన తులం రేటు
ఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు ముందుగా అధిక వడ్డీ ఉన్న క్రెడిట్ కార్డు, లోన్ యాప్ బకాయిలను క్లియర్ చేయాలని సూచించారు. అవసరమైతే నగలు, కారు వంటి ఆస్తులను అమ్మేసి.. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సహాయం తీసుకోవడం, లైఫ్ స్టైల్ ఖర్చులు తగ్గించుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భార్యకు నిజం చెప్పి ఆమె సహకారం తీసుకోవాలని.. F&O ట్రేడింగ్ అకౌంట్‌ను పూర్తిగా మూసివేసి మళ్లీ ఆ దారిలోకి వెళ్లకుండా ఉండమని సూచించారు. అలాగే అప్పు చేసి పెట్టుబడులు పెట్టడం ఎప్పుడూ సరైన నిర్ణయం కాదని, ముందుగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకుని ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగాలని అప్పుడే అప్పుల ఊబి నుంచి బయటపడొచ్చని నెటిజన్లు సలహాలు ఇచ్చారు.
