హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన దాండియా వేడుకలో ప్రమాదం చోటుచేసుకుంది. బలమైన ఈదురుగాలులు వీయడంతో లైటింగ్ స్టాండ్ ఒక్కసారిగా కుప్పకూలి విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థిని మరణించింది. మృతురాలిని వనపర్తి జిల్లాకు చెందిన బీటెక్ స్టూడెంట్ సోనాగా గుర్తించారు. ఈ ఘటనలో సోనా చెల్లెలు మీనా కూడా తీవ్రంగా గాయపడింది. సోనా, మీనా నెల రోజుల క్రితమే ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యారు.
సోనా ఈఈఈ, మీనా సీఎస్ఈ డిపార్ట్మెంట్. ఈ ఈవెంట్ ముగిసిన తెల్లారి అక్కాచెల్లెలు దసరా పండగ సెలవులకు ఇంటికి వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడంతో సోనా మృతి చెందగా.. మీనా తీవ్రంగా గాయపడింది. తెల్లారితే ఇంటికి రావాల్సిన బిడ్డల్లో ఒకరు శాశ్వతంగా తమను విడిచి వెళ్లిపోగా.. మరోకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటంతో సోనా, మీనా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో కాలేజీలో భయానక వాతావరణం నెలకొంది. విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు.
నాదర్గుల్ ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రమాదం జరిగి విద్యార్థి మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబానికి సంతాపం తెలిపిన సీఎం.. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
